
బహిరంగ జంతు వధ, అక్రమ జంతు వధశాలలు, అక్రమ రవాణా విషయంలో బెంగాల్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ‘పశ్చిమ బెంగాల్ జంతు వధ నియంత్రణ చట్టం, 1950’ని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజాగా నిర్ణయం ద్వారా ప్రభుత్వ అనుమతి లేకుండా జంతువులను వధించడం, బహిరంగ ప్రదేశాల్లో మాంసం కోయడం, అక్రమ వధశాలలను నడపడం వంటివి చట్ట వ్యతిరేక కార్యకలాపాల కిందికే వస్తాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జైలుశిక్ష, జరిమానాలు కూడా విధిస్తామని బెంగాల్ సర్కార్ ప్రకటించింది.
కలకత్తా హైకోర్టు 2018 నాటి ఆదేశాలకు మరియు 2022లో జారీ చేసిన పరిపాలనాపరమైన నిర్దేశాలకు అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి. ఈ చట్టం ఏళ్లుగా అమలులో ఉన్నప్పటికీ, అది సక్రమంగా అమలు కావడం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో ప్రకారం గోమాత, ఎద్దు, కోడె, దూడ, గేదె లేదా గేదెదూడ.. వీటిలో దేనినైనా అధికారిక అనుమతి లేకుండా ఇకపై వధించడం కుదరదు. అనుమతి కూడా వుండదు. అంతేకాకుండా రెండు రకాల ధ్రువీకరణ అవసరం అవుతుంది. ఒక ప్రభుత్వ పశువైద్యుడు, సంబంధిత మున్సిపాలిటీ అధ్యక్షునితో లేదా పంచాయతీ సమితి అధ్యక్షునితో కలిసి, సంయుక్తంగా ఒక ‘ఫిట్‌నెస్ సర్టిఫికేట్’ను జారీ చేస్తారు.
14 ఏళ్లు పైబడిన, పనికి లేదా సంతానోత్పత్తికి అనర్హమైన, లేక తీవ్రమైన అనారోగ్యం లేదా శాశ్వత వైకల్యంతో బాధపడుతున్న జంతువులకు మాత్రమే ఈ అనుమతి మంజూరు చేయబడుతుంది. ఈ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు, అధికారులు అందరూ తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.కొత్త మార్గదర్శకాల ప్రకారం, బహిరంగ ప్రదేశాలు, వీధులు, మార్కెట్లు మరియు రద్దీగా ఉండే ప్రాంతాలలో ఏ రూపంలోనైనా జంతు వధ చేయడం ఇకపై పూర్తిగా నిషేధం.
వధశాలలను తనిఖీ చేసే అధికారాన్ని ప్రభుత్వం అధికారులు మరియు పశువైద్యులకు కల్పించింది. ఎవరైనా సరే తనిఖీకి ఆటంకం కలిగించినా లేదా సమాచారాన్ని దాచడానికి ప్రయత్నించినా, వారిపై కూడా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.





