News

కూచిపూడి మహిళకు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్

15views

మైసూరులో జరిగిన జాతీయస్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో అమృతలూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మాల్యవంతం విజయలక్ష్మి గోల్డ్ మెడల్ సాధించారు. మైసూరు దత్తపీఠాధిపతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 84వ జయంతి వేడుకల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పండితుల పర్యవేక్షణలో జరిగిన పోటీలో విజయలక్ష్మి 18 అధ్యాయాల నుంచి అడిగిన ప్రశ్నలకు తడబడకుండా శ్లోకాలతో పాటు భావాన్ని వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన గణపతి సచ్చిదానంద స్వామి ఉత్తమశ్రేణిలో ఎంపిక చేసి గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రంతో అభినందించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని, స్వామీజీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.