కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల యూనిఫాం నిబంధనలను ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో హిజాబ్తో పాటు జంధ్యాలు ధరించేందుకు విద్యార్థులకు అనుమతి లభించింది.
ముఖ్యంగా విద్యాసంస్థల్లో మతపరమైన గుర్తింపుల ప్రదర్శనపై తీవ్ర వివాదం నెలకొంది. ఇప్పుడు తాజా నిర్ణయంతో ఆ ఆదేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.కొత్త ఉత్తర్వు ప్రకారం.. ప్రీ-యూనివర్సిటీ కళాశాలలతో సహా ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేట్ విద్యా సంస్థలలోని విద్యార్థులు.. నిర్దేశించిన యూనిఫాంతో పాటు హిజాబ్, జనివార (జంధ్యం), రుద్రాక్ష, శివధార, శరవాస్త్ర వాటిని ధరించవచ్చు. ఇవన్నీ యూనిఫామ్కు అదనంగా మాత్రమే ధరించవచ్చని.. వాటి స్థానంలో మాత్రం ధరించకూడదని ప్రభుత్వం తెలిపింది. అవి క్రమశిక్షణ, భద్రత లేదా విద్యార్థి గుర్తింపుపై ప్రభావం చూపకూడదని కూడా పేర్కొంది. ఈ చిహ్నాలను ధరించమని గానీ, ధరించవద్దని గానీ ఏ విద్యార్థినీ బలవంతం చేయకూడదని ప్రభుత్వం తెలిపింది. అయితే పరీక్షల సమయంలో అధికారులు నిర్దేశించిన దుస్తుల నియమావళి వర్తించవచ్చు. దుస్తుల విషయంలో ఏ విద్యార్థి కూడా వివక్షకు లేదా అవమానానికి గురికాకుండా చూసుకోవాలని పాఠశాల, కళాశాల అధికారులకు కూడా సూచించడం జరిగింది



