News

అత్యంత వైభవోపేతంగా గోదావరి పుష్కరాలు

4views

2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల లో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పుష్కరాలకు 12 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని చెప్పారు.

భక్తులకు సౌకర్యవంతంగా స్నాన ఘాట్లు, పిండ తర్పణ ఘాట్లు, ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 43 ఆలయాలను 54 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి  ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి, ఇప్పటివరకు 691 ఆలయాల అభివృద్ధికి 812 కోట్ల రూపాయలకు పైగా పనులు చేపట్టినట్లు చెప్పారు. అలాగే ఆలయాలు లేని గ్రామాలు, కాలనీల్లో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఐదు వేల భజన మందిరాల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

వేద విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు వేద విద్యార్థులకు మూడు సంవత్సరాలపాటు నెలకు మూడు వేల రూపాయల భృతి అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో దేవాదాయ చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు.