News

169 సెకన్లలో అలవోకగా శివతాండవ స్తోత్రాలు- మూడేళ్లకే జాన్వీకి రెండు ప్రపంచ రికార్డులు

4views

“పిట్ట కొంచెం కూత ఘనం” అనే సామెతను నిజం చేస్తోంది జాన్వీ అనే చిన్నారి. వయసు కేవలం మూడేళ్లే అయినప్పటికీ, ఆమె ప్రతిభని చూస్తే పెద్దలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బాల మేధావి కేవలం 169 సెకన్లలో శివ తాండవ స్తోత్రాన్ని పఠించి ప్రపంచ రికార్డులను సృష్టించింది. అంతేకాకుండా క్లిష్టమైన సంస్కృత శ్లోకాలు, చతుష్పదాలను కూడా అలవోకగా కంఠస్థం చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది. అయితే జాన్వీకి ఇది రెండో ప్రపంచ రికార్డ్ కావడం విశేషం​.

2 నిమిషాల 49 సెకన్లలో శివతాండవ స్తోత్రం
రత్లాం జిల్లాకు చెందిన నరేంద్ర స్వామి, జయా సోనీ దంపతుల కుమార్తె జాన్వీ సోనీ. ఈ చిన్నారి కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే సంస్కృత శ్లోకాలు, శివతాండవ స్తోత్రాన్ని పూర్తిగా కంఠస్థం చేసి ప్రపంచ రికార్డు సాధించింది. ఇటీవల ఆమె 2 నిమిషాల 49 సెకన్లలో శివతాండవ స్తోత్రాన్ని నిరాటంకంగా పఠించి ఈ రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతతో కుటుంబంతో పాటు నగరం, రాష్ట్రానికి కూడా పేరు తీసుకొచ్చింది.

నాయనమ్మ, తల్లి కృషితో విజయం
జాన్వి ప్రతిభ వెనక ఆమె కుటుంబ సభ్యుల కృషి ఎంతో ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె నాయనమ్మ ఊర్మిళా దేవి సోని నిరంతరం శ్లోకాలు నేర్పుతూ ప్రోత్సహించారని కుటుంబ సభ్యులు తెలిపారు. జయా సోనీ జాన్వీ శివతాండవ స్తోత్రాన్ని కంఠస్థం చేయించారని చెప్పారు. చిన్నప్పటి నుంచే జాన్వికి అసాధారణ జ్ఞాపకశక్తి ఉందని, ఒకసారి వినిపించిన విషయాన్ని వెంటనే గుర్తుంచుకుంటుందని ఆమె తండ్రి నరేంద్ర స్వామి తెలిపారు.

హనుమాన్ చాలీసాతో మొదటి ప్రపంచ రికార్డ్
అయితే గతంలో జాన్వీ ఇలాంటి ఒక ప్రపంచ రికార్డ్​నే సాధించింది. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన, జాన్వి కేవలం 2 నిమిషాల 40 సెకన్లలో హనుమాన్ చాలీసా మొత్తాన్ని ఆగకుండా పఠించి తన మొదటి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సంస్కృతంలోని అనేక శ్లోకాలను కూడా జాన్వీ గుర్తుంచుకుంటుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఈ అద్భుతమైన ప్రతిభతోనే జాన్వీ ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’, ‘వెబ్ వరల్డ్ రికార్డ్స్​’లో చోటు సంపాదించుకుందని అన్నారు. అలాగే చిన్నారి ప్రత్యేక విజయానికి గాను స్వర్ణకార సంఘం, రత్లాం కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ జాన్వీని సత్కరించారని చెప్పారు. ప్రస్తుతం జాన్వికి రామచరితమానస్​తో పాటు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని కూడా కంఠస్థం చేయిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రపంచ రికార్డులు సాధించాలని జాన్వి కుటుంబం ఆశిస్తోంది.

కేంద్రమంత్రుల ప్రశంసలు
చిన్నారి జాన్వి ప్రతిభ గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమెను భోపాల్‌లోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. జాన్వికి ఆశీర్వాదాలు అందజేసి మూడు ప్రత్యేక రికార్డులను బహూకరించారు. జాన్వి అద్భుత ప్రతిభకు ముగ్ధుడైన మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీశ్​ దేవ్డా ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా పలకరించారు. అనంతరం నగదు బహుమతిని అందజేసి అభినందించారు.

18 నెలల మరో చిన్నారి ప్రతిభ
అలాగే బిహార్‌లోని గయ జిల్లాకు చెందిన మరో 18 నెలల మరో చిన్నారి తన ప్రతిభతో రెండు ప్రపంచ రికార్డులను సాధించి అందరితో ఔరా అనిపించింది. సతీక్ష ఆదర్శి అనే ఈ చిన్నారి 50 నిమిషాల్లోనే వస్తువులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, వృత్తులు, దేశాల జాతీయ జెండాలు, ప్రపంచ అద్భుతాలు, స్వాతంత్య్ర సమరయోధులు వంటి 330 ఫొటోలను చూసి గడగడా పేర్లు చెప్పేసింది. అలా వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఆమె పేరును నమోదు చేసుకుంది.