NewsProgramms

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు…. దేశభక్తి ఉన్నోళ్ళు….

1.1kviews

హజంగా కుర్రాళ్ళంటే సినిమాలు, షికార్లు, అల్లర్లు ఇవే మనం చూస్తుంటాం. “ఈ కాలం కుర్రాళ్ళకు బొత్తిగా బాధ్యత లేకుండా పోతోంది. ఎంతసేపటికీ కుప్పి గంతులు, పిచ్చి చేష్టలు, వేలం వెఱ్ఱి ఫ్యాషన్లు” అంటూ తరచూ పెద్దలు విసుక్కుంటూ ఉండటం మనం చూస్తుంటాం.

కానీ గుంటూరులోని కొందరు కుర్రాళ్ళు ఈ కాలం కుర్రాళ్ళలా అల్లరి చిల్లరి పనులు కాకుండా ఒక ప్రయోజనకరమైన, పెద్దలందరూ భేష్ అని మెచ్చుకునే పని చేశారు. గుంటూరులో కొందరు కుర్రాళ్ళు రోజూ తమ తమ ప్రాంతాలలో జరిగే ఆరెస్సెస్ శాఖకు వెళుతుంటారు. వాళ్లకి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా తమకు శాఖలో అనేక విషయాలు నేర్పే పెద్దలకు తమ ఆలోచన చెప్పారు. అందుకు వారు కూడా అంగీకరించారు.

అంతే ఆదివారం ఆ ఆలోచనను అమలులో పెట్టారు. ఆదివారం పాఠశాలలు, కళాశాలలకు శెలవును పురస్కరించుకుని ఆ కుర్రాళ్ళందరూ గుంటూరుకు సమీపంలోని కైలాసగిరికి సైకిల్ యాత్ర చేపట్టారు. అయితే ఈ కాలం కుర్రాళ్ళలా అల్లరి చిల్లరి యాత్ర కాదది. కుర్రాళ్ళందరూ అడుగడుగునా ఎంతో క్రమశిక్షణాయుతంగా వ్యవహరించారు. దైవ భక్తిని, దేశభక్తిని ప్రదర్శించారు. ముచ్చట గొలిపే వారి యాత్ర వివరాలు తెలుసుకుందాం.

గుంటూరులోని అమరావతి రోడ్డు నుంచి ప్రారంభించి కైలాసగిరి(వెంగళాయపాళెం) వరకు  20 కిలోమీటర్లు  ఈ యాత్ర సాగింది. దారిలో కనిపించిన దేవాలయాలలో దర్శనం చేసుకుంటూ ముందుకు సాగారు కుర్రాళ్ళు. ఈ కాలం పిల్లల్లో ఇంతటి శ్రద్ధాభక్తులు ఏంటని దారి పొడవునా ఆశ్చర్యపోవటమే. “ఈ పిల్లలందరూ గుంటూరులో ఆరెస్సెస్ శాఖకు వెళుతుంటారు” అని తెలుసుకుని “అయితే ఇంకేం స్వయంసేవకులంటే ఇలాగే సంస్కారయుతంగా వ్యవహరిస్తారు” అని దారిలోని గ్రామాల వారు సమాధాన పడటం కనిపించింది.

ఈ సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని ఆరెస్సెస్ విభాగ్ ప్రచారక్ శ్రీ మల్లికార్జున ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ దేశభక్తి సంబంధించిన అనేక చిన్న చిన్న కథలు, ప్రహేళిక (క్విజ్) పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఆరెస్సెస్ జిల్లా  కార్యవాహ వీ. అమరేశ్వర రావు పర్యవేక్షించారు. అందరికీ కబడ్డీ పోటీలు జరిగాయి.

పిల్లలందరూ ఈతలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు కార్యమంలో శైవక్షేత్ర  పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి మాట్లాడుతూ చిన్నప్పటినుంచే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తితో పాటు దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం శాఖకు రావాలని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ విహార యాత్ర ఉత్సాహవంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. యాత్ర పొడవునా వందేమాతరం, భారత్ మాతాకీ జయ్ నినాదాలతో మార్మోగిపోయింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.