ArticlesNews

ఆధ్యాత్మిక సుగంధం శ్రీ రామానుజులు

54views

 ( శ్రీ రామానుజాచార్యుల  జయంతి )

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లుగా కొంతమంది మహానుభావులు కారణజన్ములు. అలాంటి వారు వారి జీవిత కాలంలో తమ తరంతో పాటు, తమ భవిష్యత్ తరాలను కూడా ఉద్దరించడానికి పూనుకుంటారు. వెయ్యేళ్ల తర్వాత కూడా ఓ మహానుభావుడి ప్రభావం మన పైన ఉందంటే అతను సామాన్యుడు కాదని అర్థం చేసుకోవాలి. అలాంటి ఓ మహానుభావుడే శ్రీమద్రామానుజులు. సామాజిక సమరసతకు ఆనాడే బాటలు పరచిన గొప్ప సమరసతా వారధి. విశిష్టాద్వైతం బోధించి భక్తి ఉద్యమాన్ని రగుల్కొల్పిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవ సారథి కూడా..

రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరు అనే ఉరిలో కలియుగం మొదలైన 4118 అంటే సామాన్యశకంలోని 1016 వ సంవత్సరంలో.. భారతీయ కాలమానంలో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి, నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రా నక్షత్రంలో ఆసూరి కేశవ సోమయాజి, కాంతిమతి అనే పుణ్యదంపతుల నోముల పంటగా జన్మించారు. ఈ సంవత్సరం ఆయన జయంతిని ఏప్రిల్ 22న జరుపుకుంటున్నాము.

రామానుజులు మనుష్యులంతా ఒక్కటే అని నమ్మిన ఆదర్శవాది. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామానుజుల కాలంలో అష్టాక్షరీ మంత్రం పరమ రహస్యంగా ఉండేది. ఈ మంత్రం ఎవరు పడితే వారు అనుష్ఠానం చేయకూడదని నియమం ఉండేది. అందుకే సదాచార సంపన్నులైన పెద్దలు, గురువులు అర్హులైన వారికి మాత్రమే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించే వారు. అంతే కాదు ఈ మంత్రాన్ని గురు ముఖతా ఉపదేశం పొందిన వారికి ముక్తి కలుగుతుందని ప్రబల విశ్వాసం. ఎవరైతే ఈ మంత్రాన్ని బహిరంగంగా ప్రకటిస్తారో వారు నరకానికి వెళ్తారన్న మూఢ నమ్మకం కూడా ఆనాటి సమాజంలో ప్రబలంగా ఉండేవి. రామానుజులు సమాజ శ్రేయస్సు కోసం అందరి బాగు కోసం తానొక్కడు నరకాన్ని వెళ్లినా ఫర్వాలేదని ఆ రోజుల్లోనే అందరినీ ఎదిరించి ఆలయ గోపురం పైకి ఎక్కి అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్యులందరికీ బోధించిన నిస్వార్ధ పరుడు. ఈ మంత్రోపదేశంతో అందరికీ ముక్తి కలిగితే తన జీవితం ధన్యమని భావించి సహజీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు.

హిందువులు పరమ పవిత్రంగా భావించే గాయత్రీ మంత్రం అందరికీ అందించిన మహాపురుషుడు రామానుజులు. రామానుజులను ఆదర్శంగా తీసుకొని ఆ తరువాతి కాలంలో ఎందరో అవతార పురుషులు ఆయన మార్గాన్ని నమ్మి ఆచరించి ఆదర్శంగా నిలిచారు. భగవద్రామానుజులు విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తీసుకురావడమే కాకుండా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన వారందరూ మంత్రాలకూ, మంత్రార్దాలకూ అర్హులేనని ఉపదేశం చేశారు. భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి అందరూ అర్హులే అని, అందులో ఎలాంటి ఆంక్షలూ, ఆటంకాలూ లేవనీ, అన్ని వర్ణాల వారు ఆలయ ప్రవేశార్హులనీ చాటి చెప్పారు. అన్ని వర్ణాల వారికి మంత్రోపదేశం చేసి, వారికి ఆలయ ప్రవేశాలను కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆచరణ పూర్వకంగా చూపారు. వెయ్యేళ్ల కిందటే భవిష్యత్ భారతావనికి దారి చూపిన ఆధ్యాత్మిక సుగంధం శ్రీ రామానుజులు.

శ్రీ భాష్యం అనేది బ్రహ్మ సూత్రాలపై శ్రీరామానుజులు రచించిన సవివరమైన వ్యాఖ్యానం, ఇది విశిష్టాద్వైత వేదాంతానికి పునాదిగా నిలుస్తుంది. భగవద్గీత భాష్యంలో, ఆయన ఆధ్యాత్మిక ఎదుగుదలకు భక్తియే కీలకమని నొక్కిచెప్పారు. భగవంతునికి సంపూర్ణ శరణాగతి యొక్క ప్రాముఖ్యతను బోధించే శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం వంటి స్తోత్రాల సమాహారమైన గద్యాలను కూడా ఆయన రచించారు. ఆయన రచనలు భక్తులకు వారి ఆధ్యాత్మిక మార్గంలో మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

ఈ నాటికి సమాజంలో ఎప్పుడైనా ఆర్ధిక సామాజిక రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతల వచ్చి మతసామరస్యం లేక అస్థిరత్వంతో, అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో శ్రీమద్రామానుజులు చూపిన విశిష్టాద్వైతం ఆధ్యాత్మిక స్థిరత్వం సాధించడానికి దిశా నిర్దేశం చేస్తాయి. అంతటి గొప్ప మహనీయుడి ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయన జయంతి రోజు ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.