
గంగానదిలో కాలుష్యం తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం అన్ని పర్యవేక్షణ కేంద్రాల వద్ద స్నానాలకు అనుకూలంగా మారిందని కేంద్రం వెల్లడించింది. గంగానదిలో పీహెచ్ విలువలు, కరిగిన ఆక్సిజన్ స్థాయులు స్నానానికి అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషన్ చౌదరీ పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు సేకరించిన నీటి నాణ్యత సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నది ప్రవహిస్తున్న ఐదు ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఉత్త ర్ ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లలో మొత్తం 112 ప్రదేశాల్లో నీటి నాణ్యతను పరీక్షించినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ నుంచి కాన్పుర్లోని పాత రాజ్పుర్ వరకు, రాయ రేలీలోని దల్మౌ, మీర్జాపుర్ దిగువ ప్రాంతం నుంచి గాజీపుర్లోని తరిఘాట్ వరకు ఉన్న ప్రాంతాలు మినహా అన్ని రాష్ట్రాల్లో నీటి నాణ్యత మెరుగ్గా ఉందని తెలిపారు. నమామి గంగే కార్యక్రమం కింద గంగానదితో పాటు దాని ఉప నదుల్లో కాలుష్య ప్రక్షాళన, నీటి పునరుజ్జీవ చర్యలు చేపట్టి నట్లు పేర్కొన్నారు.





