
ఏప్రిల్ 2వ తేదీన శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భారీ శోభాయాత్ర.. ఈ ఏడాది కూడా కర్మన్ ఘాట్ నుండి ప్రారంభమై గౌలిగూడ రామ్ మందిరం చేరుకుంటుంది. అక్కడి నుండి సికింద్రాబాద్ లోని తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఈ యాత్ర సాగనుంది.
ఈ భారీ యాత్రను పురస్కరించుకుని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, వీహెచ్‌పీ & భజరంగ్‌దళ్ నాయకులు పాల్గొన్నారు. యాత్ర సాగే మార్గంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం అధికారులు గౌలిగూడ రామ్ మందిరం నుండి అఫ్జల్ గంజ్ మీదుగా తాడ్ బండ్ వరకు రూట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.





