ArticlesNews

శ్రీవారి పేరిట తమిళగడ్డపై వెలసిన ‘తొలి అక్షరాలయం’

88views

తిరుమల  ఏడుకొండలవాడి విద్యాసంస్థలు అనగానే మనకు తిరుపతిలోని ఎస్వీయూ, పద్మావతి కళాశాలనో గుర్తుకొస్తాయి. కానీ శ్రీవారి పేరిట వెలసిన ‘తొలి అక్షరాలయం’ ఎక్కడుందో చాలా మందికి తెలియదు. ఆ చారిత్రక పాఠశాల పొరుగున ఉన్న తమిళనాడులోని వేలూరులో 15 దశాబ్దాల కిందటే మొగ్గతొడిగింది. బ్రిటిష్‌కాలంలోనే హిందూధర్మ పరిరక్షణ ధ్యేయంగా వెలసిన ఆ బడి.. ఇప్పుడు 150 వసంతాల్లోకి అడుగిడింది.

ధర్మ రక్షణే లక్ష్యంగా..

అది 1876. దేశంలో బ్రిటిష్‌ పాలన సాగుతోంది. మద్రాస్‌ ప్రెసిడెన్సీ పరిధిలో సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో అప్పటి ఆలయ నిర్వాహకులైన ‘మహంతులు’ చారిత్రక అడుగు వేశారు. వేలూరు కేంద్రంగా పాఠశాలను స్థాపించారు. ప్రారంభంలో ‘శ్రీమహంత్‌ దేవస్థానం హైస్కూల్‌’గా పిలిచేవారు. తర్వాత 1952లో ‘శ్రీవేంకటేశ్వర హైస్కూల్‌’గా, 1978లో ప్రస్తుతం ఉన్న ‘శ్రీవేంకటేశ్వర హయ్యర్‌ సెకండరీ స్కూల్‌’గా రూపాంతరం చెందింది. తితిదే చరిత్రలోనే ఇది మొట్టమొదటి విద్యాసంస్థ కావడం విశేషం. ప్రస్తుతం తితిదే ఆంధ్రప్రదేశ్‌ వెలుపల నిర్వహిస్తున్న విద్యాసంస్థలు రెండే రెండు. ఒకటి దిల్లీలోని ప్రఖ్యాత ‘శ్రీవేంకటేశ్వర కళాశాల’ కాగా రెండోది వేలూరులోని పాఠశాల. వేలూరులో ఇప్పటికీ ‘తెలుగు మాధ్యమం’ అందుబాటులో ఉన్న ఏకైక పాఠశాల ఇదే కావడం గమనార్హం. 1,020 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న పలువురు వివిధ ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారు. పి.రామచంద్రన్‌ కేరళ గవర్నర్‌గా పనిచేయగా, వేదగిరి షణ్ముగ సుందరం.. మనోమణియమ్‌ సుందరనార్‌ వర్సిటీ వీసీగా వ్యవహరించారు. మొత్తం తితిదేకి చెందిన 33 విద్యాసంస్థల్లో 21,580 మంది చదువుకుంటున్నారు.

నయా సొబగులు

వేలూరు పాఠశాల 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. తితిదే విద్యాసంస్థల అభివృద్ధికి తాజాగా విడుదల చేసిన రూ.118 కోట్ల నిధుల్లో కొంత భాగాన్ని పాఠశాల ఆధునికీకరణకు కేటాయించారు. డిజిటల్‌ తరగతులు, అత్యాధునిక ల్యాబ్‌లతో కొత్త మెరుగులు దిద్దనున్నారు.