News

‘వందేమాతరం’ నిబంధనపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

95views

అధికారిక కార్యక్రమాల్లో, పాఠశాలల్లో వందేమాతర గీతం ఆలపించాలంటూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన ఒక అభ్యర్థనను సుప్రీంకోర్టు  తిరస్కరించింది. ఈ నిబంధన అమలు తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది. వందేమాతర గీతం ఆలపించనివారిని శిక్షించాలన్న నిబంధనేదీ లేనందున ఈ వ్యాజ్యం నిరర్థకమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం పంచోలీల ధర్మాసనం పేర్కొంది. ‘‘ఏదో వివక్ష జరిగిపోతుందన్న అనుమానమేదో మీకు కలిగినట్టుంది. హోం శాఖ ఆదేశాల్లో అలాంటి అంశమేదీ లేదు’’ అని జస్టిస్‌ బాగ్చీ.. పిటిషనర్‌ అయిన మహమ్మద్‌ సయీద్‌ నూరీ తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డేకు తెలియజేశారు. వందేమాతర గీతాన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆలపించవచ్చని మాత్రమే ఉత్తర్వు చెబుతోందని, ఆలపించి తీరాలన్న నిర్బంధమేదీ లేదని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ‘ఆ గీతం పాడకపోతే శిక్షకు గురికావాల్సి ఉంటుందన్న నిబంధనేదైనా ఉంటే మీరు మా వద్దకు వచ్చి తెలియజేయండి. ఇదొక మర్యాదపూర్వక నియమావళి (ప్రోటోకాల్‌) మాత్రమే’ అని సీజేఐ పేర్కొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసే విషయంలోనూ కొన్ని నియమాలు ఉన్నాయని గుర్తుచేశారు.