ArticlesNews

శ్రీ పరాభవ నామ సంవత్సరం

75views

( శ్రీ పరాభవ నామ సంవత్సరం  – ఉగాది  ) 

కాలమనే మహావృక్షం వత్సరమనే మరో ఒక ఆకు రాల్చింది. ఇంకో చిగురాకు విచ్చుకుంటోంది. ఆరు పదుల తెలుగు వత్సర చక్రంలోని శ్రీ విశ్వావసు సెలవు తీసుకుంటుండగా, శ్రీ పరాభవ నామ సంవత్సరం నలభయ్యవదిగా కొలువు తీరుతోంది. కాలపురుషుడు తన పని తాను చేసుకుంటూ పోతాడు. ‘కంటికి కనిపించని కాలస్వరూపం తానే (‘కాలం కాలయితా మహం) అన్నాడు గీతాచార్యుడు. ‘కలయతి ఇతి కాలః’… అని నిఘంటు అర్థం. అన్నింటిని తనలో లీనం చేసుకొనేది కాలం. అది ఎవరి కోసం ఆగక అనంతంగా సాగుతూనే ఉంటుంది. కాలచక్రం నేటి నుంచి రేపటిలోకి దూసుకు పోతూంటుంది. సంవత్సరాల లెక్కింపులో అంకెలు మారుతూనే ఏటా ఉగాది తళుక్కుమంటూనే ఉంటుంది. అదే సమయంలో మనిషి రేపటి నుంచి కొత్తదనాన్ని ఆశిస్తాడు. ‘రేపు’ అనే మాటలో ఏదో అపూర్వశక్తి దాగి ఉంది. ఎంతటి విషాదంలో ఉన్న వారికైనా, అది మిణుకుమిణుకుమనే దీపంలా గోచరిస్తుంటుంది. మనిషిని ముందుకు నడిపే శక్తి ‘రేపు, కొత్త’ అనే వాటికే ఉంది. అలాంటప్పుడు రాబోయే ‘రేపు’ను ఎంత పదిలంగా చూచుకోవాలి? కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి? వేగంగా సాగిపోయే కాలంలో ప్రతి క్షణం అమూల్య సంపదే. ఒక ఆలోచన జీవితాన్ని మారుస్తుందన్నట్లు ఒక క్ష£ాణం ఎన్ని పరిణామాలకైనా దారితీయవచ్చు. ప్రతి క్షణాన్ని అమూల్య సంపదగా వాడాలి. కాలం వ్యర్థమైతే అమూల్య సంపద చేజారక తప్పదు. ఉదాహరణకు, ఒక ప్రాజెక్టు ప్రారంభ అంచనా వ్యయం.. ప్రణాళికరహితం, నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగా ఏళ్లు పైబడిన కొద్దీ ఎన్నో రెట్లు పెరగవచ్చు. ఇది కాలహరణంతో పాటు ఆర్థిక భారానికి దారితీస్తుంది.

‘బుద్ధిః నవ నవోన్మేషశాలినీ ప్రతిభా’ అన్నట్లు…. ప్రతి క్షణం కొత్తగా ఆలోచించడం, విలక్షణత ప్రదర్శన ప్రతిభావంతుల లక్షణం. పాత రాతి యుగం నుంచి బయలుదేరిన మనిషి ఇతర గ్రహాలలో విహరించడం కొత్తదనం కోసం తపించిన మానవ మేధాశక్తి ఫలితమే కదా? ఆ మేధాశక్తి సామాజిక సమరసత విషయంలోనూ కొనసాగాలి. ప్రగతితో పాటు సమతా భావనా పెరగాలి. అది అన్ని వర్గాల బాధ్యత కావాలి. ‘ఒక్కని కోసం అందరు కలసి.. అందరి కోసం ఒక్కడు నిలిచి…’ అన్నట్లు సర్వులకూ మేలు కలిగేలా ప్రవర్తిల్లినప్పుడే నిజమైన నిత్యపండుగ అనే భావన కలగాలి. అలాంటి వాతావరణం పరిఢవిల్లాలి. సింహావలోకనం చేసుకుంటే, మన పూర్వులు దానినే పాటించారని తెలుస్తోంది. భౌతికసుఖాలకు అంత (ఏ మాత్రం) ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడదు. ధర్మబద్ధమైన నడవడిని, సంతృప్తితో కూడిన జీవన సరళిని ఉన్నతమైనవిగా భావించారు. కాలానుగుణంగా జీవన విధానంలో భౌతికమైన ఎన్నో సౌలభ్యాలు లభిస్తున్నాయి. వసతులు, వనరులూ పెరుగుతున్నాయి. సాంకేతికత ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చింది. ఈ పరిణామం అభినందనీయం, హర్షణీయం. అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వికసిస్తున్న కొద్దీ దానవతత్వం పెరుగుతూ, మానవత్వం మటు మాయమవుతోంది. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ  శీలహననానికి పాల్పడుతున్నారు.

‘సమాజంలో శాంతి నిండాలి. అందరూ సుఖంగా ఉండాలి. ఏ ఒక్కడూ దుఃఖించకూడదు’ అనే సనాతన ధర్మ ఆకాంక్ష సాకారం కావడానికి చిత్తశుద్ధి, కార్యదీక్ష, దృఢనిశ్చయం కావాలి. అనువభజ్ఞుల సలహాలు, త్యాగబుద్ధితో నిష్కామకర్మగా పనిచేసే అనుయాయులు, అనుచరులు అవసరం. ‘సొంతలాభం కొంత మానుకొని పొరుగువారికి సాయపడాలి’ అనే భావన పెరిగి, అలాంటి సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. అందుకు ముందుకు నడిపించే నాయకత్వాన్ని ఎంచుకొని, బలపరచాలి. వర్తమానంలో ఆ పరిస్థితి ఉందా? అని ప్రశ్నించకుంటే… చట్టసభల్లోని ప్రజా ప్రతినిధులు, రాజకీయనేతలు, జాతికి మార్గదర్శనం చేస్తూ హిందూమతానికి, సంస్కృతీ సంప్రదాయాలకు కాపు కాయవలసిన వారే వ్యక్తిత్వ హననంతో, మతవివాద వాదప్రతివాదాలతో ప్రజను గందరగోళ పరచడం శోచనీయం. వీటి వల్ల కలిగే ప్రయోజనం మాటెలావున్నా కలివిడిగా మనుగడ సాగిస్తున్న జనం మధ్య అంతరాలు పెరిగే ప్రమాదం లేకపోలేదు.

ఇక, వీడ్కోలు తీసుకుంటున్న శ్రీ విశ్వావసు అన్ని రంగాల్లో ఆశాజనక ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. విశ్వావసు అంటే ధనం సమృద్ధిగా లభించడమని శాస్త్రకారుల మాట చాలా వరకు నిజమైంది. దేశం ఆర్థిక పరంగా బలం పుంజుకొంటూ అంతర్జాతీయంగా మూడవశక్తిగా పురోగమిస్తూ, సాంకేతికంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – ఏఐ)ను అందుకు ఉదాహరణంగా చెప్పవచ్చు. జాతీయ నాయకత్వం అనుసరించిన ప్రణాళికాబద్ధ సమయపాలన ఈ పురోగమనానికి కారణంగా భావించాలి. వాకిట నిలిచిన కొత్త సంవత్సరం (శ్రీ పరాభవ) పేరును బట్టి ఓటములు ఎదురవుతాయని పంచాంగకర్తలు అభిప్రాయపడుతున్నా, ఆ పేరుకు అతీతంగా దేశానికి సర్వ శ్రేయస్సును ప్రసాదిస్తుందని, ‘సత్పురుషుల వర్తనం వసంతంలా శోభిస్తుంది’ అన్న ఆచార్యత్రయం అభిభాషణ నిత్యసత్యం కావాలని అభిలషిద్దాం.