News

అమరావతిలో అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

77views

అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఒక చరిత్ర అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొట్టి శ్రీరాములు అందరివాడని భావించి.. ప్రతి ఒక్కరూ ఈ విగ్రహావిష్కరణ కోసం కృషి చేశారన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతి పూర్తయితే ఈ విగ్రహం మరింత అద్భుతంగా కనిపిస్తుందన్నారు. రాజధానిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్‌గా నామకరణం చేశామని చెప్పారు. అహింసా మార్గంలో ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాముల త్యాగం ఈ తరం వాళ్లు తెలుసుకోవాలన్నారు. స్ఫూర్తికి మారు పేరు ఆర్యవైశ్య సంఘమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో పొట్టి శ్రీరాములు పనిచేశారని తెలిపారు. అలాగే అనేక సామాజిక ఉద్యమాల్లో ఆయన భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టారని చెప్పారు.