
ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మందుల సామేల్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అతడిని ఎమ్మెల్యే పదవి నుంచి రేవంత్ రెడ్డి తొలగించాలని కోరారు. హిందూ ద్రోహిగా తుంగతుర్తి ఎమ్మెల్యేను అభివర్ణించారు. బూతు పదాలు వాడిన వ్యక్తిని వెంటనే రాజకీయాల నుంచి బహిష్కరించాలని బ్రాహ్మణ సంఘాలు కోరాయి.
బూతు పదాలతో విరుచుకుపడిన మందుల సామేల్ చిత్రపటాన్ని జగిత్యాలలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు దహనం చేశారు. మందుల సామేల్ క్షమాపణ చెప్పాలని.. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మోతే ఉమాకాంత్ శర్మ మాట్లాడుతూ.. కవ్వంపల్లి సత్యనారాయణ సభలో బాపనోళ్లు చదివిన మంత్రాల్లో మందుల సామేల్ బూతు పదాలు పలికారని ఆరోపించారు. బహిరంగంగా వేదమంత్రాల అర్థం తెలుసుకోకుండా వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులను పరుష పదజాలంతో మాట్లాడడం సరికాదని ప్రకటించారు.
సర్వేజనా సుఖినోభవంతు అంటూ వేద ఆశీర్వచనం చేసి శతమానం భవతి లాంటి వేదవాక్కులు పలికిన బ్రాహ్మణులను వేదాలను కించపరిచేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు మోతే ఉమాకాంత్ శర్మ ప్రకటించారు. బూతు పదాలను మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అడ్డుకోలేకపోవడం ఇది హిందూ ధర్మం దౌర్భాగ్యం అని తెలిపారు. ఏ మతంలో అయినా ఆశీస్సులు అందజేసేటప్పుడు తిట్ల పురాణం ఉండదని.. అన్ని మతాలు మంచినే బోధిస్తాయని గుర్తుచేశారు. చట్టప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై చర్యలు తీసుకోవడానికి తాము వెనుకాడమని హెచ్చరించారు. ప్రతి బ్రాహ్మణుడు లోకాసమస్తా సుఖినోభవంతు అందరూ బాగుండాలని ప్రతి నిత్యం కోరుకుంటారని.. అలాంటి బ్రాహ్మణులను దుర్భాషలాడడంతో మందుల సామేల్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని బ్రాహ్మణ సేవా సంఘం ప్రకటించింది.
ఈ వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస ఎమ్మెల్యే మౌనంగా ఉంటే వారు హిందూ ధర్మానికి వ్యతిరేకులని ముద్రపడే అవకాశం ఉందని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మోతే ఉమాకాంత్ శర్మ హెచ్చరించారు. ఎవరైనా తమ పదవిని చూసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడితే వాళ్లకు సరైన బుద్ధి చెప్పే సామర్థ్యం తమకుందని ప్రకటించారు. ఆది జాంబవ పరియోజన ప్రాంత ప్రముఖ అలగుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఎస్సీ సర్టిఫికెట్‌తో గెలిచిన మందుల సామేల్ తుంగతుర్తి ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేదాల అర్థం తెలుసుకొని మాట్లాడాలని మందుల సామేల్‌కు హితవు పలికారు.





