
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మదరసాల నిర్వహణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని మదరసాలు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయాలుగా, “ఉగ్రవాద కర్మాగారాలు” (Terror Factories) గా మారుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి.
దేవభూమి పవిత్రతను కాపాడటమే లక్ష్యం:
ముఖ్యమంత్రి ధామి మాట్లాడుతూ, “దేవభూమి”గా పిలవబడే ఉత్తరాఖండ్ పవిత్రతను కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా వెలుస్తున్న మదరసాల వల్ల జనాభా సమతుల్యత దెబ్బతింటోందని, ఇది భవిష్యత్తులో దేశ భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ మదరసా నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా నిర్మించిన మదరసాలు, మజార్లను గుర్తించి తక్షణమే కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మదరసాల నిధుల మూలాలు, విదేశీ ఆర్థిక సాయం, మరియు అక్కడ బోధిస్తున్న సిలబస్‌పై నిఘా ఉంచడానికి ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు.
కేవలం అదిమాత్రమే కాదు మదరసాల్లో కేవలం మతపరమైన బోధనలు కాకుండా, NCERT సిలబస్‌ను (సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్) ప్రవేశపెట్టాలని, జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని నిబంధనలు విధించారు.
ఇక సీఎం ధామి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మరియు మైనారిటీ సంఘాలు మండిపడుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తుండగా, మదరసాలను ఉగ్రవాదంతో ముడిపెట్టడం సరికాదని ముస్లిం మత పెద్దలు హితవు పలుకుతున్నారు.
అయితే, ముఖ్యమంత్రి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. “తప్పుడు పనులు చేసేవారు మాత్రమే భయపడాలి, క్రమశిక్షణతో నడుచుకునే మదరసాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు” అని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లో అమలు చేస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ఈ తాజా చర్యలు రాష్ట్రంలో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి.





