News

ఆదివాసీలు చిరుధాన్యాల సాగును వారసత్వ సంపదగా పరిరక్షించాలి

183views

ఆదివాసీ రైతులు చిరుధాన్యాల సాగును వారసత్వ సంపదగా పరిరక్షించి, విస్తీర్ణాన్ని పెంచాలని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మార్కెట్ కమిటీ ఆవరణలో చిరుధాన్యాలపై ప్రత్యేక సదస్సు జరిగింది. రాగి మేళా పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలోని కొయ్యూరుగూడెం, కొత్తవీధి, చింతపల్లి మండలాలకు చెందిన గిరిజన రైతులు హాజరయ్యారు. వర్షాభావ పరిస్థితులను చిరుధాన్యాలు తట్టుకుంటాయని, వీటి సాగును పెంచడం ద్వారా రైతులకు ఆదాయం రెట్టింపు అవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. చిరుధాన్యాల్లో లభించే పోషకాలు ఎగుమతులకు అనువైన రకాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి అంశాలపై ప్రదర్శనలు నిర్వహించి, అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో చింతపల్లి వ్యవసాయ శాఖ ఏడీ తిరుమలరావు, వ్యవసాయాధికారులు మధుసూదనరావు, గిరిబాబు, మార్కెట్ కమిటీ ఛైర్‌ పర్సన్‌ కిలో ఊర్మిళ, కూటమి నాయకులు, శాస్త్రవేత్తలు, మూడు మండలాల వ్యవసాయాధికారులు సిబ్బంది రైతులు పాల్గొన్నారు. అనంతరం పలు కంపెనీలకు చెందిన యంత్రాలు, ఆధునిక పనిముట్లను ఇక్కడి క్షేత్రంలో ప్రదర్శించారు.