
( మార్చి 13 – కవయిత్రి మొల్ల జయంతి )
ఎన్నో రామాయణ గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. సంస్కృత రామాయణాన్ని ఆంధ్రీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల వ్రాసిన “మొల్ల రామాయణం” ఈ రామాయణాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలానికి అందరూ ముద్దులయ్యేలా చేసిన కవయిత్రి మొల్ల. ఆమె రాసిన రామాయణం ‘మొల్ల రామాయణం’గా ఎంతో ప్రసిద్ధి చెందింది. రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా కూడా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. మొల్ల అసలు పేరు ఆతుకూరి మొల్లమాంబ. ఆమె 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో తాను రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది.ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయల సమయంలోనిదని కూడా ప్రసిద్ది. ఇక మొల్ల రచనలను చదివినవారు మొల్ల రచనా శైలి చాలా సరళమైందని, రమణీయమైనదని అంటారు.
మొల్ల స్వస్థలం కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామం. ఈ గ్రామం కడప పట్టణానికి 56 కి.మీ దూరంలో, బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొన్ని మూలాల ఆధారంగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి ఈమెను గారాబంగా పెంచారని ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం కావడంతో పెళ్ళి కూడా చేసుకోలేదని స్దానికులు చెబుతారు. మొల్ల రామాయణం మొత్తం ఆరు కాండాలలో 871 పద్యాలతో కూడుకుంది. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉండేదని సాహిత్యకారులు చెబుతుంటారు.సంస్కృత రామాయణాన్ని తేట తెలుగులో పద్యకావ్యంగా మలచి మనకందించారు. కంద పద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల ‘కందరామాయణం’ అని పేరు పొందింది. కవయిత్రి మొల్ల వ్రాశారు కాబట్టి ‘మొల్ల రామాయణం’ అని ప్రాచుర్యం పొందింది.
వీరి జ్ఞాపకార్థం 2017 ఏప్రిల్ 26 వ తేదీన వీరి స్టాంపును 5 రూపాయల విలువతో విడుదల చేసింది భారత తపాలా శాఖ. స్టాంపు మీద చెట్టుకింద కూర్చుని ఎదురుగా ఉన్న వ్యాసపీఠం మీద తాళపత్ర గ్రంధాల పై గంటంతో వ్రాస్తున్న మొల్ల కనువిందు చేస్తారు.రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతి అయిన మార్చి 13వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది.





