
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అయితే, సాగుకి వెన్నెముకగా నిలుస్తున్న మహిళా రైతుల శ్రమను గుర్తించడంలో మాత్రం దశాబ్దాలుగా వెనకబడే ఉన్నాం. ఐక్యరాజ్యసమితి 2026ను ‘అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం’గా ప్రకటించింది. ఇది పొలంలో స్వేదం చిందిస్తున్న ప్రతి స్త్రీ మూర్తికి దక్కిన గౌరవం. మహిళా దినోత్సవం సందర్భంగా… సాగులో మార్పులు, సాంకేతికతతో మహిళలు సాధిస్తోన్న అద్భుతాల గురించి కచ్చితంగా చర్చించుకోవాల్సిందే…
రైతు అనగానే పురుషుడి రూపమే గుర్తొస్తుంది. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవం వేరు. విత్తనం నాటడం నుంచి పంటను ఇంటికి చేర్చే వరకూ ప్రతి అడుగులోనూ మహిళల శ్రమ దాగి ఉంటుంది. భారతదేశంలో దాదాపు 80శాతం మంది గ్రామీణ మహిళలు వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారని ఎన్నో నివేదికలూ చెబుతున్నాయి. ముఖ్యంగా మగవాళ్లు ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్తున్న తరుణంలో… గ్రామీణ భారతంలో వ్యవసాయ బాధ్యతను భుజానికెత్తుకుంటోంది ఆడవాళ్లే మరి.
యాజమాన్య హక్కులతో…
ఒకప్పుడు భర్తలకు చేదోడు వాదోడుగా, కూలీలుగా మాత్రమే ఎక్కువగా స్త్రీలు పొలాల్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ దృశ్యం మారుతోంది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో భూమి హక్కులు ఆడవారి పేరు మీద మారుతున్నాయి. దీనివల్ల బ్యాంకు రుణాలు, సబ్సిడీలు నేరుగా వారికే అందుతున్నాయి. అంతేకాదు, నిర్ణయాధికారం… ఏ పంట వేయాలి? ఏ రకమైన ఎరువులు వాడాలి? ఎక్కడ విక్రయించాలి? అనే విషయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఇది సరిపోదు.
ఆధునిక వ్యవసాయంలో…
మహిళా రైతులు సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా ఆధునిక వ్యవసాయం దిశగానూ అడుగులు వేస్తున్నారు. రసాయనరహిత సాగులోనూ ఆడవాళ్లదే అగ్రస్థానం. వంటింటి చిట్కాలను పెరటి తోటలకు, అక్కడి నుంచి పొలాలకు విస్తరించి ‘విషరహిత ఆహారాన్ని’ పండిస్తున్నారు. డ్రోన్ల ద్వారా మందులు చల్లడం, స్మార్ట్ ఫోన్ల ద్వారా మార్కెట్ ధరలు తెలుసుకోవడం వంటివాటిని స్త్రీలు వేగంగా నేర్చుకుంటున్నారు. కేవలం పంటను అమ్మడమే కాకుండా, వాటిని పచ్చళ్లు, పొడులు, ప్యాకేజ్డ్ ఆహారంగా మార్చి అగ్రిప్రెన్యూర్స్‌గా ఎదుగుతున్నారు.
స్వయం సహాయక సంఘాల విప్లవం…
భారతదేశంలోని సహాయక సంఘాల వ్యవస్థ మహిళా రైతుల పాలిట వరంలా మారింది. చిన్న పొదుపుతో మొదలైన ఈ సంఘాలు నేడు… ట్రాక్టర్లను, వరికోత యంత్రాలు… వంటివి కొనుగోలు చేసి అద్దెకు ఇస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. ఒక పురుషుడు వ్యవసాయం చేస్తే అది ఆ కుటుంబానికే పరిమితం. కానీ ఒక మహిళ వ్యవసాయం చేస్తే అది మరెందరో స్త్రీలకు ప్రేరణ అవుతుంది.
పంచుతూ… పెరుగుతూ…
మహిళా రైతులలో కనిపించే గొప్ప గుణం సహకారం. ముఖ్యంగా గ్రామీణ మహిళలు తమ వద్ద ఉన్న దేశీ విత్తనాలను తోటివారికీ ఉచితంగా ఇస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. ఒడిశాకు చెందిన ‘సీడ్ మదర్’ కమలా పూజారి… ఇందుకు గొప్ప ఉదాహరణ. అంతరించిపోతున్న దేశీ విత్తనాలను సంరక్షించి ఇతరులకు పంచుతూ జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నారీమె. ఇక, ప్రముఖ భారతీయ పర్యావరణ వేత్త వందనా శివ… నవధాన్య ఫౌండేషన్ ఏర్పాటుచేసి విత్తన సంరక్షణ, సేంద్రియ వ్యవసాయంతో పాటు మహిళా రైతుల హక్కులకోసం పోరాడుతున్నారు. అలానే తెలంగాణలో మహిళా రైతు సంఘాలతో పనిచేస్తున్న దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ కూడా ఈ కోవకే చెందుతుంది. ఇందులోని సభ్యురాళ్లందరూ గివ్‌టు గెయిన్ సూత్రాన్ని ఆచరిస్తూ… చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయం, విత్తన బ్యాంకుల ఏర్పాటు, సంఘం దుకాణం వంటి కార్యక్రమాలతో ఆర్థిక స్థిరత్వాన్నీ, సుస్థిరతనూ సాధించగలిగారు.
సవాళ్లు ఇంకా ఉన్నాయి…
సాగులో స్త్రీలు ఇన్ని విజయాలు సాధిస్తున్నప్పటికీ, పురుషులతో సమానంగా వేతనాలు అందకపోవడం, శారీరక శ్రమను తగ్గించే చిన్న తరహా యంత్రాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికీ భారతదేశంలో 13 శాతం ఆడవాళ్లకు మాత్రమే భూమిపై యాజమాన్య హక్కులు ఉన్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం వారికి ఇంకా కష్టతరంగానే ఉంది. అయితే, ప్రభుత్వం అందిస్తున్న ‘మహిళా కిసాన్ సశక్తీకరణ్ పరియోజన’ వంటి పథకాలు ఈ అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. మరో పక్క మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుతో వ్యాపార ప్రయోజనాలను అందుకుంటూ ఆర్థికంగా ముందుకు వెళ్తున్నారు.





