
అనంతపురం నగరంలోని రాణీ నగర్‌లో ఒక యువకుడు కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి “జిహాద్” అంటూ నినాదాలు చేస్తూ హల్‌చల్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. షాహిన్ అహ్మద్ అనే యువకుడు రాణీ నగర్‌లోని స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ దేవేంద్ర ఇంటికి వెళ్లాడు. కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడిన షాహిన్ అహ్మద్, అక్కడ నేలపై పడుకుని అల్లాను ప్రార్థిస్తూ, గట్టిగా “జిహాద్” అంటూ నినాదాలు చేయడం ప్రారంభించాడు.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న కానిస్టేబుల్ భార్య సుజాత భయంతో గట్టిగా కేకలు వేయడంతో, చుట్టుపక్కల కాలనీవాసులు అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని షాహిన్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి పోలీసులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద లభించిన పత్రాల్లో కొన్ని మతపరమైన అంశాలకు సంబంధించినవి కాగా, మరికొన్ని అతని వ్యక్తిగత వివరాలకు సంబంధించినవని పోలీసులు గుర్తించారు. ఆ పత్రాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా?.. అనే కోణంలో ఫోరెన్సిక్ బృందం సహాయం తీసుకోనున్నారు. ప్రస్తుతం షాహిన్ బ్యాంక్ అకౌంట్ వివరాలను, షాహిన్ అహ్మద్ బ్యాంక్ ఖాతాల్లో ఇటీవల జరిగిన లావాదేవీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి లేదా అనుమానాస్పద వ్యక్తుల నుంచి ఏవైనా నిధులు అందాయా అనే అంశాన్ని నిర్ధారించుకునే పనిలో ఉన్నారు.
ఈ ఘటన తర్వాత రాణీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు నిఘాను పెంచారు. స్థానికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, విచారణ పూర్తి కాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.





