
ఇటీవల కేరళలో జరిగిన ఒక ఉదంతం తీవ్రమైన వివాదాన్ని కలిగించింది. ఏప్రిల్ 2023లో కేరళలో మొదటి వందే భారత్ రైలు ప్రారంభమైన సందర్భంగా, కొందరు పాఠశాల విద్యార్థులు రైలులో ప్రయాణిస్తూ ఆర్ఎస్ఎస్ గణగీతాన్ని ఆలపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. విద్యార్థులు ప్రభుత్వ రైలులో ఒక నిర్దిష్ట సంస్థకు సంబంధించిన గీతాన్ని పాడటాన్ని కేరళలోని అధికార కమ్యూనిస్ట్ కూటమి అయిన LDF తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు చదువుతున్న పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ.. అది కేవలం ఒక దేశభక్తి గీతమని, పిల్లలు వారి ఇష్టపూర్వకంగా పాడారని, దాని వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. ఇలాంటివే మరిన్ని సంఘటనలు కేరళ దేవాలయాల్లోనూ చోటు చేసుకున్నాయి. అదేవిధంగా తమిళనాడులో కూడా డీఎంకే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, మైదానాలలో ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లు, శిక్షణా శిబిరాలను, పథ సంచలనాలను నిర్వహించడాన్ని నిషేధించింది. RSSకు సంబంధించిన గీతాలను ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆలపించడానికి అనుమతి నిరాకరిస్తున్నారు. ఇలా తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు వేసిన అప్పీళ్లను తోసిపుచ్చుతూ, ప్రాథమిక హక్కులను కాలరాయడం సరికాదని స్థానిక హైకోర్టు, సుప్రీంకోర్టు, పేర్కొన్నాయి. క్రమశిక్షణతో కూడిన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాల్సిందేనని తీర్పులు వచ్చాయి. న్యాయస్థానాలు ఆయా ప్రభుత్వాలను మందలించాయి కూడా. కేవలం “శాంతిభద్రతల” నెపంతో అనుమతి నిరాకరించలేరని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని కోర్టులు ఆదేశించాయి.
మరి ఈ రాష్ట్రాలు ప్రత్యేకించి సంఘ గీతాలను ఎందుకు పాడనివ్వట్లేదు, ఎందుకు వివక్షత చూపిస్తున్నాయి. అసలు సంఘ గీతాలలో ఏముంటాయి, ఎందుకు సంఘ వాటిని ఆలపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో కానీ, సంఘ శాఖల్లో కానీ తరుచుగా గీతాలను ఆలపిస్తుంటారు. వీటిని గణగీత్ అని పిలుస్తుంటారు. ఇవి కేవలం పాటలు మాత్రమే కాదు, సంఘ్ కార్యకర్తల్లో నిర్దిష్ట లక్ష్యాన్ని పెంపొందించే ప్రయత్నం కూడా.. సంఘ శాఖలో శారీరక వ్యాయామాల తర్వాత, అందరూ కలిసి ఒకే స్వరంతో గీతాన్ని పాడటం వల్ల మనస్సు ఏకాగ్రత చెందుతుంది. ఇది స్వయంసేవకులలో సామూహిక భావనను ఇది పెంచుతుంది. దేశభక్తి గీతాల ద్వారా కార్యకర్తలలో ఉత్సాహాన్ని, దేశం కోసం పనిచేయాలనే స్ఫూర్తిని నింపుతారు. కఠినమైన పదాల కంటే పాటల ద్వారా సిద్ధాంతాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని సంఘం భావిస్తుంది. ఈ గీతాల్లో భారతీయ సంస్కృతి, మహనీయుల త్యాగాలు, జాతీయ విలువల ప్రస్తావన ఉంటుంది. వీటివల్ల మనకు దేశ చరిత్రపై అవగాహన కలుగుతుంది. ప్రతిదినం పాడటం వల్ల ఆ గీతంలోని సందేశం మన మనస్సులో బలంగా నాటుకుపోతుంది. దానివల్ల మనం కూడా దేశం కోసం ఏమైనా చేయాలి అనే భావన పెరుగుతుంది.
సంఘ గీతాలలోని దేశభక్తి భావాలు అత్యంత లోతైనవి. ఈ గేయాలు కేవలం పదాల కూర్పు మాత్రమే కాకుండా, ఒక స్వయంసేవకునిలో దేశం పట్ల ఉండే బాధ్యతను నిరంతరం గుర్తుచేస్తుంటాయి. ఆ పాటల్లో మనదేశాన్ని ఒక భూభాగంగా కాదు జగన్మాతగా ఆరాధించడం కనిపిస్తుంది. మనదేశ ఔన్నత్యం కనిపిస్తుంది. దేశభక్తి అంటే కేవలం జెండాకు వందనం చేయడం మాత్రమే కాదు, సమాజంలోని అట్టడుగు వర్గాల సేవ చేయడం కూడా దేశభక్తే అని ఈ గీతాలు బోధిస్తాయి. సంఘ గీతాలు దేశభక్తి ప్రధానంగా ఉంటాయి. దేశమే ముఖ్యం, అంటే Nation First అనే సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటాయి. ఇలా దేశభక్తిని పెంపొందించే పాటలను కేవలం RSSపై వ్యతిరేకతను ప్రదర్శించడానికి, మతపరమైనవి అంటూ పేర్కొంటూ, లౌకికత్వానికి వ్యతిరేకమంటూ వాదిస్తూ తమ దేశభక్తి వ్యతిరేక వైఖరిని చాటుకుంటున్నారు.





