ArticlesNews

భక్త తుకారాం పాండురంగ స్వామిలో ఐక్యమైన రోజు ‘తుకారాం బీజ్‌’

102views

( మార్చి 5 – తుకారాం బీజ్‌ )

భక్త తుకారాం పాండురంగ స్వామిలో ఐక్యమైన ఫాల్గుణమాసం బహుళ విదియను ‘తుకారాం బీజ్‌’ అంటారు. పాండురంగ స్వామికి ప్రీతిపాత్రుడైన భక్తుడు తుకారాం జన్మించిన మహారాష్ట్ర దేహు గ్రామంలో నాందురకీ అనే మహిమాన్విత వృక్షం ఉంది. ఈ చెట్టు నీడలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ భక్తి గీతాలు (అభంగాలు) రచించినందువల్ల అది తుకారామ్‌ వృక్షంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు- పాండురంగని స్మరిస్తూ, తుకారాం అభంగాలు పఠిస్తూ ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దివ్యానుభూతి పొందుతుంటారు.

ప్రచారంలో ఉన్న విస్తృత కథనాల ప్రకారం అప్పటి గ్రామ పండితులు తుకారాం రచనలు సమాజ హితమైనవి, ఆమోదయోగ్యమైనవి కావని నదిలోకి విసిరేశారు. తుకారాం భక్తిని లోకానికి చాటడానికి విఠలుడు- ఆ అభంగాలను నీళ్లపై తేలియాడుతూ తుకారాం చెట్టు వద్దకు వచ్చి ఆగేలా చేశాడు. పాండురంగని కరుణను, భక్తుని నిబద్ధతను తుకారాం చెట్టు తన నీడలో నిలిపిందని భక్తులు విశ్వసిస్తారు.

ఆర్తితో తుకారాం పిలిస్తే చెలికాడుగా వచ్చి కబుర్లు చెప్పే పాండురంగడు- ఒకరోజు తుకారాం కలలో కనిపించి.. మర్నాడు మధ్యాహ్నంవేళ పుష్పక విమానం పంపిస్తానని, తన సన్నిధికి రమ్మని చెప్పాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలియజేయగా.. హేళన చేశారు. కానీ మరుసటి రోజు ఏం జరుగుతుందో చూద్దామని జనం గుమిగూడారు. నిజంగానే తుకారాం చెట్టు వద్దకు పుష్పక విమానం వచ్చింది. అందరూ చూస్తుండగా తుకారాం ఆ విమానం ఎక్కి.. పాండురంగ సన్నిధి చేరాడు.

ఆ రోజు ఫాల్గుణ మాసం బహుళ విదియ. ఆ తిథిని ‘తుకారాం బీజ్‌’ పేరుతో భక్తులు పవిత్రదినంగా ఆచరిస్తారు. ‘బీజ్‌’ అంటే ద్వితీయ తిథి. ఆయన భౌతిక లోకాన్ని విడిచి వైకుంఠానికి చేరినట్లుగా వార్కరి సంప్రదాయం విశ్వసిస్తుంది. ఈ రోజున తుకారాంను స్మరిస్తూ భక్తులు భజనలు, కీర్తనలు, నామసంకీర్తన చేస్తారు. భక్తిమార్గంలో నామస్మరణకు అత్యున్నత స్థానం కల్పించిన తుకారాం జీవితం సాధారణమే కానీ.. ఆయన భక్తి అసాధారణమైంది.