ArticlesNews

120 ఏళ్లుగా హోలీ వేళ.. ‘రామ్ లీలా’

92views

సాధారణంగా దీపావళి, దసరా సమయంలో దేశవ్యాప్తంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఈ నాటకం ద్వారా రావణ సంహారం, సీతారాముల పట్టాభిషేకం వంటి రాయాణంలోని ముఖ్య సన్నివేశాలను తెలియజేస్తారు. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మాత్రం హోలీ సందర్భంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తారు. గత 79 ఏళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అలాగే ఇక్కడ ప్రదర్శించే రామ్‌లీలా నాటకానికి పాకిస్థాన్‌తో సంబంధం ఉంది. ఈ క్రమంలో గ్వాలియర్‌లో ప్రదర్శితమయ్యే రామ్‌లీలాకు పాక్‌తో సంబంధం ఏంటి? దీని వెనుకున్న చరిత్ర? తదితర విషయాలు తెలుసుకుందాం.

దేశంలో హోలీ సందర్భంగా రామ్‌లీలా ప్రదర్శించిన ఏకైక ప్రదేశం గ్వాలియరే. అక్కడ ఉంట్‌పుల్ సమీపంలో ఝాంగ్ సమాజానికి చెందిన సభ్యులు హనుమంతుడికి ఓ చిన్న గుడిని నిర్మించారు. ఈ ప్రదేశంలోనే గత 79 ఏళ్లుగా హోలీ పండగనాడు రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనకు భక్తులు, వీక్షకులు పోటెత్తుతారు. కాగా, దేశ విభజనకు ముందు పాకిస్థాన్‌లోని రసిద్‌పూర్‌లో ఝాంగ్ కమ్యూనిటీ రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించేది. అంటే ఈ రామ్‌లీలాకు 120 ఏళ్ల చరిత్ర ఉంది.

ముందుగానే రిహార్సల్స్
నాటక రిహార్సల్స్ కోసం ఝాంగ్ కమ్యూనిటీ హోలీకి ఎనిమిది రోజుల ముందు గ్వాలియర్‌లో సమావేశమవుతుంది. అప్పుడు గ్వాలియర్‌ సహా పంజాబ్, హరియాణా, దిల్లీ, చండీగఢ్, కశ్మీర్ నుంచి ఝాంగ్ సమాజానికి చెందిన నటులు వస్తారు. కొంతమంది కళాకారులు రిహార్సల్ చేస్తారు. మరికొందరు వేదిక, కాస్టూమ్స్, ఇతర ముఖ్యమైన పనులను చూసుకుంటారు.

పాకిస్థాన్‌తో కనెక్షన్
ఈ రామ్‌లీలాకు పాకిస్థాన్‌తో ప్రత్యక్ష సంబంధం ఉంది. దేశ విభజనకు ముందు పాక్‌లోని ఝాంగ్ జిల్లాలోని రసిద్‌పుర్ గ్రామంలో రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించేవారు. దేశ విభజన తర్వాత ఝాంగ్ కమ్యూనిటీ సభ్యులు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. వారు హోలీ సమయంలో రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తారు.

“ఈ రామ్‌లీలాను మా పూర్వీకులు ప్రారంభించారు. ఈ నాటకం ద్వారా పిల్లల్లో రాముడిలో ఉన్న మంచి గుణాలను పెంపొందించాలనేదే మా ఆలోచన. నేను గత 35 ఏళ్లుగా రామ్‌లీలా నాటకంలో పాత్ర పోషిస్తున్నాను. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. దేశ విభజన జరిగిన తర్వాత రాంలీలాతో సంబంధం ఉన్న రసిద్‌పూర్ గ్రామానికి చెందిన కొందరు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొందరు పంజాబ్‌, ఇంకొందరు హరియాణా, దిల్లీ, గ్వాలియర్‌లో స్థిరపడ్డారు. కానీ రామ్‌లీలా ప్రదర్శనను ఆపలేదు.” అని ఝాంగ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఆర్టిస్ట్ ప్రమోద్ కుమార్ తెలిపారు.

బాధ్యతగా భావిస్తారు!
అలాగే రామ్‌లీలాను ప్రదర్శించడాన్ని ఝాంగ్ కమ్యూనిటీ ప్రజలు ఒక సంప్రదాయంగా, బాధ్యతగా భావిస్తారు. అందుకే ఈ నాటకంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా పాలుపంచుకుంటారు. హరియాణాకు చెందిన రామ్‌ నరేంద్ర ధావన్ రామ్‌లీలా నాటకంలో ఏ పాత్రనైనా పోషించగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్‌రౌండర్. గత 40 ఏళ్లుగా రామ్‌లీలా నాటకంలో ఆయన పలు పాత్రలను పోషిస్తున్నారు. రామ్‌లీలా ప్రజలపై బలమైన ప్రభావాన్ని చూపిందని రామ్‌ నరేంద్ర అన్నారు. ఈ నాటకం పరస్పర ప్రేమ, గౌరవం, విలువలను పెంచిందని తెలిపారు.

అలాగే ఓ ప్రఖ్యాత ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్న హిమాన్షు రామ్‌లీలా నాటకంలో కుంభకర్ణుడి పాత్రను పోషిస్తున్నారు. “నా పూర్వీకుల వారసత్వంలో భాగం కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. నేను పెద్దయ్యాక నాటకంలో చిన్నచిన్న పాత్రలు పోషించాను. ఎంత బిజీగా ఉన్న హోలీ సమయంలో జరిగే రామ్‌లీలా నాటక ప్రదర్శనకు గ్వాలియర్‌కు తప్పకుండా వస్తాను. నాటక ప్రదర్శనకు ఇక్కడ కళాకారులు ఎవరూ డబ్బులు తీసుకోరు. అందరూ తమ పూర్వీకుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.” అని హిమాన్షు పేర్కొన్నారు.

ఈ రామ్‌లీలా దేశ విభజనకు ముందు పాక్‌లోని ఝాంగ్‌లో ఉద్భవించిందని రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు హరియోమ్ నాగ్‌పాల్ తెలిపారు. తమ పూర్వీకులు ఈ నాటక ప్రదర్శనను దాదాపు 120 ఏళ్ల క్రితం ప్రారంభించారని అన్నారు. ఈ నాటకంలో నటులందరూ ఝాంగ్ కమ్యూనిటీకి చెందినవారేనని పేర్కొన్నారు.