News

శబరిమల అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేయనున్న ట్రావెన్‌కోర్‌ బోర్డు

165views

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును తిరిగి సమీక్షించాలని పలు రివ్యూపిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డ్ (టీడీబీ) మాత్రం మొదటి నుంచీ మహిళల ప్రవేశాన్ని (10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు) వ్యతిరేకిస్తూ వస్తోంది. పాత సంప్రదాయాన్నే కొనసాగించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్‌ వెల్లడించారు.

దీనిపై ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘శబరిమల ఆలయ సంప్రదాయాలు, పరిరక్షణ కోసమే ట్రావెన్‌కోర్‌ బోర్డు ఏర్పాటైంది. మహిళల ప్రవేశం విషయంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగించాలని బోర్డు సమావేశంలో నిర్ణయించాం. ఇందులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఆలయ సంరక్షణే టీడీబీ లక్ష్యం. అందుకే అఫిడవిట్‌ను దాఖలు చేయాలని టీడీబీ నిర్ణయించింది’’ అని కె.జయకుమార్‌ తెలిపారు. మార్చి 14లోగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేస్తామని తెలిపారు.

సుప్రీంకోర్టు 2018లో శబరిమలకు(అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిచ్చింది. అప్పటి నుంచి ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఇవన్నీ సుప్రీం కోర్టు వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సహా ఆయా వ్యాజ్యదారులు మార్చి 14లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.