News

బీబీనగర్ AIIMSలో నక్సల్ సానుభూతిపరులు.. దీని వెనుక ఎవరున్నారు?

86views

యూనివర్శిటీలు, కాలేజీల్లో మాత్రమే నక్సల్స్ సానుభూతిపరులు వుంటారని అనుకుంటాం. కానీ కొత్తగా బీబీనగర్ లోని AIIMSలో కూడా వచ్చేశారు. ప్రకృతి వైజ్ఞానిక యాత్ర పేరుతో నక్సల్స్ సానుభూతిపరుడు, నిత్యం సోషల్ మీడియా వేదికగా హిందూ, వైదిక ధర్మంపై విషం చిమ్మే జయరాజు, విజ్ఞానదర్శిని రమేష్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిలో వున్న మెడికల్ విద్యార్థులకు ఈ నక్సల్స్ సానుభూతిపరులు ఏం నేర్పుతారు? అసలు బీబీనగర్ ఏయిమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రదేశాల్లోకి వీరిని ఎవరు ఆహ్వానించారు? ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఇలాంటి సైద్ధాంతిక దృక్పథం వున్న వారితో పరిచయాలు చేయించడం అవసరమా? అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

డైరెక్టర్ ప్రొఫెసర్ అమిత అగర్వాల్, అలాగే డీన్ నేతృత్వంలో సాగే అనాటమీ విభాగం ఇలాంటి నక్సల్స్ సానుభూతిపరులతో ఎలా సమన్వయం చేసుకుంటోంది? అలాంటి వ్యక్తులకు ఎందుకు, ఎలా సహకరిస్తోంది అన్న అనుమానాలు, ఆందోళనలు పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ పీచమణిచేసింది. నక్సల్స్ రహిత దేశంగా అడుగులు పడుతున్న ఇలాంటి కీలక సమయాల్లో ఇలాంటి నక్సల్స్ సానుభూతిపరులకు ఎయిమ్స్ లాంటి సంస్థలు ఎలా చోటిస్తున్నాయి? అంటూ జాతీయవాదులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వున్న ఎయిమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేస్తున్న వారు, పాలనా విభాగంలో వున్న వ్యక్తులు… అర్బన్ నక్సల్స్ ని, వారి కార్యక్రమాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? బయటనేమో ఛత్తీస్ గఢ్, ఒడిశా తో సహా.. చాలా ప్రాంతాల్లో నక్సల్స్ ని, నక్సల్ వాదాన్ని ప్రజలు బహిరంగంగానే తిరస్కరిస్తున్నారు. వారి స్మృతిలో వుండే అమర వీరుల స్థూపాలను కూల్చిపారేస్తున్నారు. ఇంతటి కాలం చెల్లిన సిద్ధాంతాన్ని ప్రజలు ఛీత్కరిస్తుంటే.. ఎయిమ్స్ లోని కొందరు వారిని భుజానికి ఎత్తుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్ ఆవిర్భవించాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోంది. దేశంలో ఎక్కడ కూడా నక్సల్స్ సానుభూతిపరులను ప్రోత్సహించడం లేదు. వారికి నీడ దొరకడమూ కష్టంగానే వుంది.అలాంటి విపత్కర పరిస్థితుల్లో నక్సల్స్ సానుభూతిపరులకు బీబీనగర్ ఎయిమ్స్ పరిపాలనా అధికారులు ఎందుకు చోటిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.

నక్సల్ ఉద్యమం పేరుతో, వనవాసులను ఉద్ధరిస్తామన్న బూటకపు మాటలతో నక్సలైట్లు అడవులను భ్రష్టం చేస్తున్నారు. నిత్యం భద్రతా దళాలను కవ్విస్తూ.. అడవులను, వన్యప్రాణులను, సహజ వనరులను నాశనం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ప్రకృతిని రక్షించాలంటూ నక్సల్స్ సానుభూతిపరులు కార్యక్రమాలు నిర్వహించడం భలే విడ్డూరంగా వుంది. ఎయిమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను వైద్య రంగంలో రకరకాల పరిశోధనలకు వేదిక కావాలే తప్పించి, విభజన రాజకీయాలు, వర్గ నిర్మూలన రాజకీయాలకు వేదిక కాకూడదని జాతీయవాదులు నొక్కి చెబుతున్నారు.