
మన ఇంటి పిచ్చుకలను మనమే కాపాడుకుందాం అని ఏసీపీ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. 20 రోజుల పాటు సాగే పిచ్చుకల పరిరక్షణ ప్రచారాన్ని విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం రైల్వేస్టేషన్ రోడ్‌లోని 150 ఏళ్ల మర్రిచెట్టు వద్ద ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా పిచ్చుకల గూళ్లు, నీటి పాత్రలు, ధాన్యం కంకులు పంపిణీ చేయడంతో పాటు చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరి పంటను ఆశించే నల్లి నివారణకు ఎంతో ఉపయోగపడే పిచ్చుకలను రైతులు తమ ఇళ్లకు ఆహ్వానించేవారని తెలిపారు. అంతరించిపోతున్న ఈ పక్షి జాతిని రక్షించేందుకు జేవీ రత్నం నేతృత్వంలోని ‘గ్రీన్ క్లైమేట్’ బృందం విశేష కృషి చేస్తోందని కొనియాడారు.
జేవీ రత్నం మాట్లాడుతూ.. 50 ఏళ్ల కిందట వరికి వచ్చిన నల్లి నివారణకు రసాయన క్రిమిసంహారకాలు పిచికారీ చేయడంతో ఆశించిన ఫలితం దక్కలేదని, పైగా పిచ్చుకలు అంతరించిపోవడం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఫా ట్రస్ట్ సీఈవో డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ.. మానవాళికి మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. వాటికి అవసరమైన ఆహారం, నీరు, గూడు అందుబాటులో ఉంచాలని సూచించారు





