
( ఫాల్గుణ శుక్ల పూర్ణిమ – చైతన్య మహాప్రభు జయంతి )
భక్తి ఉద్యమకారులలో సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి, ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన మహనీయుడు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన్ను సాక్షాత్తూ శ్రీకృష్ణుడిగా పలువురు భక్తులు విశ్వసిస్తారు. చైతన్య మహాప్రభు ప్రారంభించిన సంకీర్తనోద్యమం కుల, మత, వర్ణ, వృత్తి, స్రీ, పురుష భేదాలకు అతీతంగా… సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికోన్నతిని సాధించే అవకాశాన్ని అందించింది… శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తనోద్యమ ప్రచారం కోసం భారత దేశమంతటా విస్తృతంగా పర్యటించారు. భక్తితత్త్వాన్ని ప్రజలకు బోధించారు. అత్యంత పాపభూయిష్టమైన జీవనాన్ని గడిపేవారు తమ దురలవాట్లను విడిచిపెట్టేలా, పవిత్రమైన భగవన్నామాలను జపించేలా చేయడం శ్రీచైతన్యుల సంకీర్తనోద్యమం సాధించిన గొప్ప విజయం. ప్రజలకు ‘హరే కృష్ణ’ మహామంత్రాన్ని రుచి చూపిన గౌడీయ వైష్ణవ వ్యవస్థాపకుడు, పరమ భాగవతోత్తముడు ఆయన.
శ్రీ చైతన్య మహాప్రభు పదిహేనవ శతాబ్దంలో 1486 ఫాల్గుణ శుక్ల పూర్ణిమ నాడు పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా నవద్వీప మాయాపూర్‌లో… పరమ భక్తులైన శ్రీజగన్నాథ మిశ్రా, శచీదేవి దంపతులకు జన్మించారు. ఈ సంవత్సరం ఆయన జయంతిని మార్చి 3న జరుపుకుంటున్నాము. ఆయన బాల్య నామం ‘విశ్వంభర’, ముద్దు పేరు ‘నిమాయ్’. వీరిని గౌరంగుడు అని కూడా పిలిచేవారు.
ఇరవై నాలుగేళ్ళ వయసు వరకూ ఆయన నవద్వీపంలోనే బ్రహ్మచర్య ఆశ్రమాన్నీ, గృహస్థ జీవనాన్నీ గడిపారు. ఆయన భార్య లక్ష్మీప్రియా దేవి చిన్న వయసులోనే మరణించగా… మళ్ళీ వివాహం చేసుకోవాలని తల్లి ఆయనను కోరారు. ఆమె మాట ప్రకారం శ్రీ విష్ణుప్రియా దేవిని శ్రీ చైతన్యులు వివాహం చేసుకున్నారు. పదకొండో ఏట తండ్రి చనిపోగా, శ్రాద్ధకర్మలు చేయడానికి గయకు వెళ్లాడు. అప్పుడే అతడిలో వైరాగ్య భావనలు ఉత్పన్నమయ్యాయి. ఇక సంసారానికి స్వస్తి పలికి, కేశవభారతి అనే సన్యాసి ద్వారా సన్యాస దీక్ష పొందాడు.
సన్న్యాసం స్వీకరించిన తరువాత… తల్లి ఆనతి మేరకు శ్రీ జగన్నాథపురిలో శ్రీ చైతన్య మహాప్రభువు ఇరవై నాలుగేళ్ళు నివసించారు. సమాధి స్థితికి చేరి బ్రహ్మానందాన్ని అనుభవించారు. వారు ప్రత్యేకంగా ఒక మతాన్ని స్థాపించకపోయినప్పటికీ.. వారి శిష్యులు వ్యాసమహర్షి రచించిన బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు రాశారు. అవి చైతన్య మతంగా ప్రచారం అయ్యాయి. వారి శిష్య కోటిలో రూపగోస్వామి సుప్రసిద్ధుడు. భక్తిని ఒక రసంగా ప్రవచించడమే కాదు, ‘భక్తి రసామృత సింధువు’ అనే గ్రంథాన్ని కూడా రాశాడితడు.
చైతన్య మహాప్రభువు ఆరు సంవత్సరాలు శ్రీమద్భాగవతాన్ని ప్రచారం చేస్తూ దక్షిణభారతదేశమంతటా పర్యటించారు. అలాగే భగవద్గీత ఉపదేశాలను ఆచరణీయ పద్ధతిలో ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభు బోధనలు ‘దశమాలబోధనలు’గా ప్రసిద్ధి చెందాయి. వారు దృష్టిలో శ్రీకృష్ణపరమాత్మే దేవ దేవుడు. ఆయనే అనంతసత్యం. ఆ స్వామే రస సముద్రుడు, జీవులకు ఆధారం. కృష్ణభక్తితోనే ముక్తి లభిస్తుంది. శ్రీకృష్ణుణ్ణి ప్రేమించడమే మనందరి పరమ లక్ష్యం కావాలని చెప్పేవాడు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన చైతన్య మహాప్రభు 48వ ఏట నిర్యాణం చెందాడు. వారు ప్రారంభించిన ఆ సంకీర్తనోద్యమం శ్రీల ప్రభుపాద ద్వారా ‘హరేకృష్ణ’ సంకీర్తనోద్యమంగా ప్రపంచవ్యాప్తమయింది. అది నేటికీ వారి శిష్యుల ద్వారా కొనసాగుతోంది.





