News

పైన టమాట.. కింద ఆలుగడ్డ! రెండు పంటలు

103views

వ్యవసాయ రంగంలో పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెంచే దిశగా వారణాసిలోని ఐసీఏఆర్-భారతీయ కూరగాయల పరిశోధనా సంస్థ -IIVR శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ‘గ్రాఫ్టింగ్’ (అంటుకట్టడం) పద్ధతి ద్వారా ఒకే మొక్కపై రెండు వేర్వేరు పంటలను పండించి ఔరా అనిపిస్తున్నారు.

పైన టమాట.. కింద ఆలుగడ్డ!
ఈ వినూత్న ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు టమాట, ఆలుగడ్డ మొక్కలను కలిపి గ్రాఫ్టింగ్ చేశారు. దీనివల్ల మొక్క పైభాగంలో టమాటాలు కాస్తుండగా, భూమిలోపల వేర్ల భాగంలో ఆలుగడ్డలు వస్తున్నాయి. తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. టమాట-ఆలుగడ్డ కాంబినేషన్ మాత్రమే కాకుండా, టమాట, వంకాయను కలిపి కూడా శాస్త్రవేత్తలు సాగు చేస్తున్నారు. ఒకే మొక్కకు ఒకవైపు టమాటాలు, మరోవైపు వంకాయలు పండటం విశేషం. ఈ సాంకేతికత వల్ల రైతులకు శ్రమ తగ్గడమే కాకుండా, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న రెండు పంటలను ఒకేసారి పొందే అవకాశం ఉంటుంది.

రైతులకు బహుళ ప్రయోజనాలు
ఈ ప్రయోగాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఈ సాంకేతికత వల్ల కలిగే లాభాలను వివరించారు. ‘భూమి, నీరు, పోషకాలను ఈ పద్ధతిలో సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఒకే మొక్క ద్వారా రెండు పంటలు రావడం వల్ల సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. తక్కువ విస్తీర్ణంలో రెండు రకాల కూరగాయలు పండటం వల్ల రైతులకు రెట్టింపు ఆదాయం లభిస్తుంది.’ అని వెల్లడించారు. గురువారం తన పర్యటనలో భాగంగా మంత్రి ఐఐవీఆర్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భూమిని పచ్చదనంతో నింపాలని, తద్వారా మానవ జీవితాన్ని సుసంపన్నం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.