
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు.. అత్యాచారం, బలవంతపు మతమార్పిడి, ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను వలలో వేసి వ్యభిచార కూపం నడిపిన ఆరోపణలపై అరెస్టయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్రీన్, అఫ్రీన్‌లను వారి సహచరుడు చందన్ యాదవ్‌తో కలిసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి ఇద్దరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బాగ్ సేవానియా పోలీస్ స్టేషన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు బిలాల్, చాను, యాసిర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. గతంలో అబ్బాస్ నగర్‌లోని ఓ చిన్న స్లమ్‌లో నివసించిన అమ్రీన్, అఫ్రీన్.. ఇటీవల భోపాల్‌లోని సాగర్ రాయల్ విల్లాస్‌లో ఒక విలాసవంతమైన విల్లాకు మారారు. యువతులను దోపిడీ చేసి సంపాదించిన అక్రమ డబ్బుతోనే ఈ మార్పు జరిగిందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని.. నెలకు రూ.10,000 జీతం, ఉచిత వసతి, భోజనం, “హై-ప్రొఫైల్ జీవితం” అనే పేరుతో నమ్మబలికారు. కానీ ఆ ఉద్యోగం వారి జీవితంలో ఒక భయానక అనుభవంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదుల ప్రకారం.. వారిని క్రమంగా పార్టీలు, పబ్బులు, లౌంజ్‌లకు తీసుకెళ్లి ధనవంతులైన వ్యక్తులతో కలవాలని ఒత్తిడి చేశారు. మద్యం, మాదకద్రవ్యాలు బలవంతంగా తాగించారని.. కొన్ని సందర్భాల్లో మత్తు మందులు ఇచ్చి లైంగిక దాడికి గురిచేశారని బాధితులు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 23న జరిగిన అరెస్టుల సమయంలో అమ్రీన్, అఫ్రీన్, చందన్ యాదవ్‌ల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమ్రీన్ ఫోన్‌లో అనుమానాస్పద వాట్సాప్ గ్రూపులు ఉండగా, పలువురు యువతుల ఫోటోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.





