News

ఆధ్యాత్మిక గురువులు దైవస్వరూపాలు : జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌

186views

ఆధ్యాత్మిక గురువులను దైవస్వరూపాలుగా చూడనివారు దుర్మార్గులు, మూర్ఖులు, ఆటవికులని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ వ్యాఖ్యానించారు. తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దర్గావద్ద ఉన్న రాతిస్తంభంపై మురుగన్‌ భక్తులు కార్తికదీపం వెలిగించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించి, అమలుచేయలేదు. డీఎంకే నేతలు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్‌ స్వామినాథన్‌ మాట్లాడుతూ… గురువు అంటే భగవంతుని స్వరూపమన్నారు. భగవంతుని పాదాలు తాకలేమని, అయితే గురువు పాదాలను తాకడం సులభమని చెప్పారు. తమిళనాడులో హేతువాదులు గురువును భగవంతునిగా చూస్తున్న మనల్ని దుర్మార్గులు, మూర్ఖులు, ఆటవికులుగా భావిస్తున్నారన్నారు. కానీ నిజమైన దుర్మార్గులు, మూర్ఖులు, ఆటవికులు వారేనని తెలిపారు. గురువు అనుగ్రహం వల్ల ధైర్యం, సాంత్వన లభిస్తాయన్నారు. గురువుల దగ్గరకు వెళ్లినప్పుడు వారి ప్రకాశం భక్తుల బలహీనతలను తొలగించడానికి సహాయపడుతుందని చెప్పారు. తన పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉందని, మరింత ధైర్యంతో పనిచేయాలని అనుకుంటున్నట్లు జస్టిస్‌ స్వామినాథన్‌ వ్యాఖ్యానించారు.