News

USA: అమెరికాలో హిందువులే విద్యాధికులు

129views

అమెరికాలో అత్యంత విద్యాధిక మతవర్గం హిందువులేనని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ విడుదల చేసిన ఒక సర్వే నివేదిక వెల్లడించింది. యూదులు అత్యంత విద్యాధికుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. వివిధ మతవర్గాల స్థితిగతులపై 2023-24లో నిర్వహించిన రిలిజియస్‌ ల్యాండ్‌స్కేప్‌ సమగ్ర సర్వే (ఆర్‌ఎల్‌ఎస్‌)లో వెలువడిన గణాంకాల ఆధారంగా ఈ అధ్యయన నివేదిక వెలువరించారు. అమెరికాలో నివసిస్తున్న ప్రతి పదిమంది హిందువుల్లో ఏడుగురు.. అంటే 70% మంది పట్టభద్రులు కాగా యూదుల్లో 65% మందికి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉన్నట్టు గుర్తించారు. అమెరికా మొత్తం జనాభాలో పట్టభద్రులు సరాసరిన 35% మాత్రమే. జాతీయ సరాసరి కన్నా ఎక్కువ శాతం మంది ముస్లింలు, బౌద్ధులు, సనాతన క్రైస్తవులు, సాధారణ ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులు పట్టభద్రులుగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇవాంజెలికల్‌ ప్రొటెస్టెంట్లు, కేథలిక్కులు జాతీయ సరాసరి కన్నా తక్కువ సంఖ్యలో పట్టభద్రులైనట్టు వెల్లడైంది. హిందువులు, ముస్లింలు, బౌద్ధుల్లో అత్యధికులు ఉన్నత విద్యాభ్యాసం కోసమే అమెరికాకు వస్తున్నందున వారిలో పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు సర్వే తెలియజేసింది. దీనికోసం 2023-24 మధ్య 36,908 మందిని ప్రశ్నించారు.