News

ఆరెస్సెస్ వ్యక్తి నిర్మాణంతో పాటు ప్రజలను దేశ నిర్మాణం వైపు ప్రేరేపిస్తుంది : హోసబళే

110views

భారత్ దీర్ఘకాలిక అభివృద్ధి అంతా గ్రామాల బలంపైనే ఆధారపడి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. పరిశోధకులు తమ పరిశోధనలలో గ్రామీణాభివృద్ధి అన్న మాధ్యమంగా తమ పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో రామకృష్ణ పరమహంస ప్రొఫెసర్ల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్బంగా వందేళ్ల సంఘ ప్రయాణంలో సంఘ్ చేసిన కార్యక్రమాలు, ఎదుర్కొన్న సవాళ్లు, మైలు రాళ్లను హోసబళే వారికి వివరించారు. సంఘ్ హిందుత్వాన్ని జాతీయ వాద దృక్పథం నుంచి చూస్తుందని, ప్రతి వ్యక్తి కూడా తన పనిని చేస్తూ, దేశానికి సేవ చేయడానికి అంకితమై వుండటం ద్వారా దేశ గౌరవాన్ని పెంచినవారవుతారన్నారు.

ఆరెస్సెస్ వ్యక్తి నిర్మాణం, వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలను దేశ నిర్మాణం వైపు ప్రేరేపిస్తుందన్నారు. విపత్కర పరిస్థితులు తలెత్తిన ప్రతి సమయంలోనూ సంఘ్ నిస్వార్థంగా సేవ చేస్తూ సమాజానికి అండగా నిలిచందన్నారు. దీనికి ఎలాంటి రుజువులూ చూపించాల్సిన అవసరమే లేదన్నారు. ఇలా సేవ చేయడం సామాజిక బాధ్యతగా సంఘ్ భావిస్తుందని, ఇలాంటి సమిష్టి చర్యలను సంఘ్ నిరంతరం ప్రోత్సహిస్తూనే వుంటుందన్నారు.

స్వాతంత్రం తర్వాత భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ఆహార, సాంకేతికత, విద్య, క్రీడలు, రక్షణ వంటి రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆహార ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందన్నారు.

ఇక.. జాతీయ ఐక్యతను ప్రస్తావిస్తూ వైవిధ్యభరితమైన సమాజంలో అభిప్రాయ భేదాలున్నా.. పౌరులు దేశభక్తితో ఐక్యం అవుతారన్నారు. దీనికి అనేక ఉదాహరణలు వున్నాయని పేర్కొంటూ.. ఓ అథ్లెటిక్ ఒలంపిక్ పతకం గెలుచుకున్న సమయంలో ఆ అథ్లెటిక్ నేపథ్యం, గుర్తింపు, ప్రాంతం.. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా అందరూ సమష్టి విజయాన్ని జరుపుకుంటారన్నారు. ఈ ఐక్యతే దేశ నాగరికత నైతికతను నిర్వచించే బలం అని అన్నారు. ఐక్యత, సమగ్రత అనేవి దేశానికి గొప్ప ఆస్తులు అని అభివర్ణించారు.

ఇక హోసబళే స్వావలంబన గురించి కూడా తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. కోవిడ్ సమయంలో భారత్ అద్భుతమైన పాత్రను పోషించిందన్నారు. అనేక దేశాలకు వైద్య సహాయాన్ని, మానవతా సహాయాన్ని అందించిందని గుర్తు చేశారు. ఇదంతా వసుధైక కుటుంబకం అన్న సాంస్కృతిక సూత్రంతో అనుసంధానమై వుంటుందన్నారు. ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణించడం అనే సూత్రాన్ని సంఘ్ ఇప్పటికీ ఆచరణలోకి పెడుతుందన్నారు. ఐక్యతను కాపాడుకోవడం అనేది పౌరుల ఉమ్మడి బాధ్యత అని అన్నారు.

భారతీయులు తక్కువగా చదువుకున్నారని ఆంగ్లేయులు కథనాలను సృష్టించారని, బలహీనులమని నమ్మింపచేశారన్నారు. ఇంత బలహీనులని చెప్పి, చెప్పి చాలా సంవత్సరాలు పాలించారన్నారు. గత వంద సంవత్సరాలుగా భారతీయులలో వుండిపోయిన ఆత్మ విస్మృతిని పక్కకు తప్పించి, జాగృతం చేయడానికి సంఘ్ పనిచేస్తోందన్నారు. వందేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక అవాంతరాలను ఎదుర్కొందని, అయినా తన లక్ష్యం నుంచి ఎన్నడూ పక్కకు తప్పుకోలేదని స్పష్టం చేశారు.