News

సింహాచలంలో ధార్మిక సదస్సు

123views

హిందూ ధర్మపరిరక్షణకు అర్చకులే వెన్నెముక అని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ దాసరి శ్రీనివాసులు స్పష్టం చేశారు. దేవదాయశాఖ, హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహగిరిపై ధార్మిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాసరి శ్రీనివాసులు హాజరైన అర్చకుల సంక్షేమం, ధర్మ పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. భగవంతుడికి, భక్తుడికి మధ్య అనుసంధానకర్త అర్చకుడేనని, అర్చకత్వం ఎంతో గొప్పదని కొనియాడారు.

ఈ సందర్భంగా అర్చకుల కష్టాలపై ఆయన సానుకూలంగా స్పందించారు. అర్హత కలిగిన అర్చకులను ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ద్వారా నమోదు చేయించి, పారదర్శక పద్ధతిలో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వృత్తిపరమైన నైపుణ్యం కోసం అర్చకులకు ప్రత్యేక అకాడమీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధర్మాన్ని కాపాడాలంటే ముందుగా అర్చకుడి ఆకలి తీరాలని, ఆ దిశగా ఇకపై పనిచేస్తామని భరోసా ఇచ్చారు. దేవుడి భూములు అన్యాక్రాంతం కాకుండా అర్చకులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. గత ఆరేళ్లుగా నిలిచిపోయిన హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌ను తిరిగి ఉత్తేజితం చేస్తామని, ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా ధర్మప్రచార కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.