
అయోధ్య వందేమాతరంపై ప్రభుత్వం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్ పై ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి హర్షం వ్యక్తం చేశారు. దేశభక్తి వారసత్వాన్ని జరుపుకునే దశ అని తెలిపారు. దశాబ్దాలుగా వందేమాతరం గీతం స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఏకం చేసిందని, దీని చారిత్రక నేపథ్యంతో, దేశ సాంస్కృతికతో విస్తృతంగా ముడిపడి వుందన్నారు. వందేమాతరం ఉద్యమానికి ముందు నుంచే అంత ప్రాముఖ్యం వుందని, కానీ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ తో మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు.
దేశ గుర్తింపైన త్యాగం, ఐక్యత, స్వాభిమానం లాంటి విలువల గుర్తింపును సజీవంగా వుంచడానికి ప్రభుత్వ నిర్ణయం సహాయపడుతుందన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. వందేమాతరంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశభక్తికి సంబంధించింది అని, హిందూ, ముస్లిం సమస్య కానేకాదన్నారు.
జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించే విషయంలో కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించాలని అని ఆదేశించింది. జాతీయ గీతం ‘జనగణమన’ పాడటానికి ముందు వందేమాతరం కూడా పాడాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉదయం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం వందేమాతరం ఆలపించేటప్పుడు అందరూ తప్పనిసరిగా నిలబడాలి.





