
సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. గుత్తిలోని సేవాగఢ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు ముగిశాయి. చివరి రోజు ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు మారుతీప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాతం, పంచామృతాభిషేకం, అర్చన, మహా మంగళహారతితో పాటు ప్రత్యేక పూజలు చేశారు. సేవాలాల్ మహరాజ్‌కు కుంభాభిషేకం జరిపించారు. ఉత్సవ విగ్రహాన్ని తోలారం గుర్రంపై ఊరేగించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సేవాలాల్ మాలధారులు ఇరుముడులు సమర్పించారు. ఆలయం ఎదుట ఉన్న హోమం కట్టపై మహా భోగ్ (హోమం) నిర్వహించారు. 108 మంది కన్యలచే పూర్ణ గంగ కలశోత్సవం నిర్వహించారు. బంజారాలు సంప్రదాయ దుస్తులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రాకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ విష్ణుచరణ్ మాట్లాడుతూ సేవాగఢ్ ఎంతో పవిత్రమైన పుణ్య స్థలమన్నారు. సేవాలాల్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అనంతరం ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రభుత్వ ఆధికారులను జేసీ అభినందించారు.





