ArticlesNews

విశాఖపట్నంలో నేవీ విన్యాసాలు

142views

భారత నౌకాదళం ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ వరకు విశాఖ తీరాన ‘అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ’, ‘మిలాన్‌–2026’ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 135 దేశాల ప్రతినిధులు, 40 యుద్ధనౌకలు, 50 యుద్ధ విమానాలు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌ ద్వారా భారత్‌ తన సముద్ర శక్తిని ప్రపంచానికి చాటిచెప్పనుంది. 18న రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూ, 19న సిటీ పరేడ్‌ వంటి కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే, ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకలకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగమే వివిధ శాఖల ఖజానాల నుంచి రూ.37 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేస్తోంది. నిధుల కొరత ఉన్నప్పటికీ, విశాఖ గౌరవం నిలబెట్టేలా అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు.

భారత సైనిక సంపత్తిలో కీలక కేంద్రంగా ఎదిగిన విశాఖ తీరం, మరో అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనకు సిద్ధమైంది. గతంలో 2022, 2024లలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించిన విశాఖ, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌–2026 మరియు ఐఓఎన్‌ఎస్‌లకు ఆతిథ్యమిస్తోంది. చంద్రగుప్తుని కాలం నాటి సముద్రయాన చరిత్ర నుండి నేటి అణు జలాంతర్గాముల తయారీ వరకు భారత్‌ సాధించిన ప్రగతిని ఈ వేడుకలు ప్రపంచానికి చాటిచెప్పనున్నాయి. ఈ నెల 15 నుంచి 25 వరకు జరిగే ఈ ప్రదర్శనతో విశాఖ నగరం మరోసారి ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించనుంది.

సాంస్కృతిక వారధిగా…
విశాఖలో జరగనున్న నౌకాదళ వేడుకలు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పనున్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ. 70 లక్షల వ్యయంతో 200 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. కూచిపూడి, ధింసా, తప్పెటగుళ్లు, కోలాటం, కొమ్ముకోయ వంటి 10 రకాల జానపద కళారూపాలతో విదేశీ ప్రతినిధులకు మన సంప్రదాయాలను పరిచయం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

భద్రత, మౌలిక వసతులే కీలకం.
రాష్ట్రపతి, సీఎం వంటి ప్రముఖుల రాక నేపథ్యంలో హోం శాఖ భారీ భద్రతా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ. 2.85 కోట్లతో డ్రోన్‌ కెమెరాలు, 100 మంది స్విమ్మర్లు, గస్తీ బోట్లను సిద్ధం చేశారు. అతిథుల కోసం 218 వాహనాలను ఏర్పాటు చేయగా, ఇంధనం, అద్దె ఖర్చుల కోసం రూ. 1.45 కోట్లు వెచ్చిస్తున్నారు. అలాగే వేట నిలిపివేసిన మత్స్యకారులకు రూ. 1.12 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం కేటాయించింది.

భారీ ఏర్పాట్లు
అంతర్జాతీయ నౌకాదళ ఈవెంట్ల కోసం జిల్లా యంత్రాంగం రూ. 37 కోట్లతో యుద్ధప్రతిపదికన పనులు చేపడుతోంది. ఆర్కే బీచ్‌ రోడ్డులో 3.5 కి.మీ. మేర బారికేడ్లు, విద్యుత్‌ దీపాల అలంకరణ మరియు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రజల కోసం 12 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, విదేశీ అతిథుల కోసం ‘మిలాన్‌ విలేజ్‌’ స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీ శాఖలు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.

తొమ్మిది రోజుల పాటు సందడి వాతావరణం..
నౌకాదళ వేడుకలు 17న రాష్ట్రపతి విందుతో అధికారికంగా ప్రారంభమై 25 వరకు సాగనున్నాయి. ప్రధానంగా 18న రాష్ట్రపతి చేతుల మీదుగా ఫ్లీట్‌ రివ్యూ, 19న ఆర్కే బీచ్‌లో ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ నిర్వహించనున్నారు. 20న ఐఓఎన్‌ఎస్‌ కాంక్లేవ్‌, 21 నుండి 25 వరకు సముద్ర గర్భంలో ‘మిలాన్‌’ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 25న ముగింపు వేడుకలతో ఈ అంతర్జాతీయ ఉత్సవం పూర్తికానుంది.