
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హిందువులకు సంతోషాన్ని పంచే పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన హిందూ అభ్యర్థి గయేష్వర్ చంద్ర రాయ్ ఢాకా-3 నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, జమాతే ఇస్లామీ నేత మహమ్మద్ షాహినూర్ ఇస్లాంను ఓడించారు. గయేష్వర్ చంద్ర రాయ్‌కు మొత్తం 98,785 ఓట్లు రాగా, జమాత్ అభ్యర్థికి 82,232 ఓట్లు మాత్రమే లభించాయి. రాయ్ సాధించిన ఈ విజయం బంగ్లాదేశ్ పార్లమెంటులో హిందువుల గళాన్ని వినిపిండానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గయేష్వర్ చంద్ర రాయ్ 1951, నవంబర్ ఒకటిన ఢాకాలోని కెరానిగంజ్‌లో జ్ఞానేంద్ర చంద్ర రాయ్, సుమతి రాయ్ దంపతులకు జన్మించారు. 1990వ దశకంలో బీఎన్‌పీ నేతృత్వంలోని ప్రభుత్వాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రిగా, మత్స్య , పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. రాజకీయాలతో పాటు ఆయన కుటుంబానికి బీఎన్‌పీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాయ్ కుమారుడు అమితాబ్ రాయ్, బీఎన్‌పీ నేత నితాయ్ రాయ్ చౌదరి కుమార్తె నిపున్ రాయ్ చౌదరిని వివాహం చేసుకున్నారు.





