
చదువులోనూ, క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ చూపుతూ, పర్యావరణ పరిరక్షణలోనూ మేము సైతమంటూ భాగస్వాములవ్వడమే కాకుండా ఇంటి ముందు, ఇంటి లోపల వాడి పారేసిన ప్లాస్టిక్, పాత ఇనుము, కలప, వస్త్రాలతో పునర్వినియోగ వస్తువులను తయారు చేసి వావ్ అని అనిపించుకుంటున్నారు బీసీ గురుకుల విద్యార్థులు. విద్యార్థులను పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులను చేయడంతో పాటు వారిలో సృజనాత్మకతను వెలికితీసే వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది.
మహాత్మా జ్యోతి రావు పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో లభ్యమయ్యే వ్యర్థాలతో కళాకృతులను విద్యార్థులతో తయారు చేసేలా వ్యర్థాల నుంచి సంపద (Wealth Out of Waste – WOW) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలతో కళాకృతులు, పునర్వినియోగించుకునేలా వస్తువుల తయారీని ప్రోత్సహిస్తోంది. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, ఐక్యత, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా వావ్ కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 109 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై సామాజిక సృహ కలిగించడమే కాకుండా వారి సృజనాత్మకతను వెలికితీయాలని బీసీ సంక్షేమ శాఖాధికారులు నిర్ణయించారు. అదే సమయంలో గురుకుల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా వ్యర్థాల నుంచి సంపదను వెలికితీసే (వావ్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురుకుల పాఠశాలల్లో ఉండే చిక్కీల రేపర్లు, ప్లాస్టిక్, పాత ఇనుము, కలపతో వివిధ రకాల కళాకృతులు, నిచ్చెనలు, కబోర్డులు, బ్యాగ్ లు, ఎండిన పువ్వుల రెక్కలతో ధూప్ స్టిక్స్, పాత దుస్తులతో ఫ్లోర్ మ్యాట్స్ వంటి వస్తువులను తయారు చేస్తున్నారు.
ఒక్కో స్కూల్ ఒక్కో ప్రొడెక్ట్
వావ్ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలతో చేసిన వస్తువులు ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా పునర్వినియోగించేలా విద్యార్థులు తయారు చేస్తున్నారు. ఇలా ఒక్కో గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రత్యేకమైన వస్తువులు రూపొందించారు. ఎంజేపీ సింహాచలం పాఠశాల విద్యార్థులు ఎగ్ ట్రేస్, పాత బట్టలతో స్టడీ టేబుల్, కుర్చీలు తయారు చేశారు. పెనుకొండ ఎంజేపీ విద్యార్థులు ప్లాస్టిక్ బాటిళ్లు, మెటీరియల్ తో బర్డ్ ఫీడర్, పెద్దాపురం విద్యార్థులు కొబ్బరి వ్యర్థాలతో పెన్ స్టాండ్, కారాడ విద్యార్థులు చిక్కీ రేపర్లతో బ్యాగ్ లు, బాస్కెట్లు, కొత్తవలస విద్యార్థులు ప్టాస్టిక్ బాటిళ్లతో స్వాన్ మోడల్ గార్డెన్, లేపాక్షి విద్యార్థులు ప్లాస్టిక్, ఎలక్ట్రిక్ మెటీరియల్ తో షాండేలియర్ మోడల్ వంటి పునర్వినియోగ వస్తువులు రూపొందించారు.

ఆకట్టుకున్న వాటర్ బాటిళ్లతో డ్రిప్ ఇరిగేషన్
ప్టాస్టిక్ తో పర్యావరణ పరిరక్షణ ప్రమాదంలో పడింది. అదే ప్లాస్టిక్ ను వినియోగించి నీటిని పొదుపు చేసేలా, రైతులకు మేలు చేసేలా నార్పల విద్యార్థులు రూపొందించిన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వాడేసి పడేసిన వాటర్ బాటిళ్లను డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లో వినియోగించారు. మొక్కల పెంపకం సమయంలో గ్రిల్ ఏర్పాటు చేశారు. ఆ మొక్కకు ఆనుకుని ఓ కర్రకు మూడు వాటర్ బాటిళ్ల అడుగు భాగం తీసేసి, ఒకదానిపై ఒకటి అమర్చారు. ఆ బాటిళ్ల ద్వారా మొక్క మొదలులలో చుక్క చుక్క నీరు పడేలా ఈ సిస్టమ్ ను రూపొందించారు. వాటర్ బాటిళ్లతో తయారు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థతో నీరు ఆదా అవ్వడమే కాకుండా రైతుకు పెట్టుబడి భారం కూడా తగ్గనుంది.
ప్లాస్టిక్ రహితంగా గురుకులాలు
వావ్ కార్యక్రమంతో వ్యర్థాలు, ప్లాస్టిక్ అవశేషాలతో పునర్వియోగ వస్తువుల తయారీపై విద్యార్థులు దృష్టి సారించడంతో, వారి సృజనాత్మకతను వెలికి తీయడానికి అవకాశం కలిగిందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణతో పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. గతంలో చిక్కీ రేపర్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు గురుకులాల ఎక్కడిపడితే అక్కడ దర్శమిచ్చేవి. వావ్ కార్యక్రమంతో కళాకృతులు, పునర్వియోగ వస్తువులు తయారు చేయడంతో, పరిసరాలు ప్లాస్టిక్ రహితంగా మారాయి.
పర్యావరణ పరిరక్షకులు
ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిసరాలు కూడా అపరిశుభ్రంగా మారుతూ, దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందుతూ మానవ ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణనానికి హాని కలుగకుండా వ్యర్థాలతో పునర్వినియోగ వస్తువుల తయారీపై బీసీ సంక్షేమ శాఖ దృష్టి సారించింది. వావ్ కార్యక్రమంలో బీసీ గురుకుల విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా పునర్వినియోగ వస్తువుల తయారీని ప్రోత్సహించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల విద్యార్థుల అద్భుతమైన, అబ్బుర పరిచే రీతిలో పునర్వినియోగ వస్తువులు తయారు చేశారు. వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్ఠాలు, పాత ఇనుము, కలప, వస్త్రాలతో ఇంటి ఆలంకరణ కళాకృతులు, వాటర్ బాటిళ్లతో డ్రిప్ ఇరిగేషన్, స్టడీ టేబుల్, కుర్చీలు రూపొందించి ఔరా అనిపించారు. పర్యావరణ పరిరక్షకులుగా ముందు నిల్చొని సమాజ హితానికి పునాదులు వేశారు. వెన్నుతట్టి ప్రోత్సహాస్తే.. అద్భుతాలు ఆవిష్కరిస్తామని రుజువు చేసిన విద్యార్ధులకు అభినందనలు.-ఎస్ సవిత, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి





