
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. వెంకటరమణ సేవా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సాధు, గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు.
గోసేవతోపాటు వేద పండితుల మంత్ర పఠనం, గురువుల ఆధ్యాత్మికోపన్యాసాలు, గోవింద, శ్రీరామ నామ జపంతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. పేదలకు ఉచిత సేవలు అందించేందుకు 216ఏ జాతీయ రహదారి పక్కన అయిదెకరాల స్థలంలో 100 పడకల ఆసుపత్రి, వృద్ధుల కోసం ఆనంద నిలయం, యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం, టిటిడి నమూనా ఆలయం, రహదారి సత్రం నిర్మించేందుకు నిర్వాహకులు కొలనువాడ పెదకృష్ణంరాజు సంకల్పించారు. ఆ నిర్మాణాలకు అంకురార్పణగా ఈ కార్యక్రమాలు చేపట్టారు.
వీరంపాలెం బాలాత్రిపురసుందరి పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణశాస్త్రి పర్యవేక్షణలో తెల్లవారుజాము 4.25 గంటలకు కొలనువాడ కుటుంబ సభ్యుల శంఖారావంతో 250 గోవులు, 18 అశ్వాలు, గజ, ధేను, వృషభాలతో శోభాయాత్ర మొదలైంది. అనంతరం వివిధ ప్రత్యేక పూజలు, హోమాల సహిత యాగశాలలో 60 మంది వేద పండితులతో నవ కుండాత్మక భూశాంతి మహాయాగం నిర్వహించారు.
అయోధ్య కల్యాణ రాముని స్వర్ణ ధనస్సు, హిందూ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు, దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.





