ArticlesNews

జాగృత కర్మయోగి

99views

( ఫిబ్రవరి 11 – మాఘ బహుళ ఏకాదశి గురూజీ జయంతి )

గురూజీకి సంఘమే సంసారం. ఆ సంసారం దేశవ్యాప్తమైనది. దాన్ని ఇంకా అధికాధికంగా దేశమంతటా విస్తరింప చేశారు. గురూజీ భారతీయ సంస్కృతిలోని పరమోజ్వల తత్వానికి సాక్షాత్తు నడుస్తూ మాట్లాడుతూ కన్పించే ప్రతీక. ఆయన ఉపన్యాసాలు స్థిరంగా ఉండేవి. దానికంటే మించి ఆయన జీవన చరిత్ర పరిణామదాయకంగా ఉండేది. భగవద్గీతలో పరమేశ్వరుడు ప్రబోధించిన కర్మయోగాన్ని ఆయన బహు జాగ్రత్తగా తన ఆచరణలో సాధించారు. ఆయన మూర్తి కళ్ల ముందు ఎప్పుడూ కన్పిస్తూనే ఉంటుంది. అదే ఆదర్శం అందరికీ కర్తవ్య ప్రేరణను ప్రసాదిస్తుంటుంది.

1948‌లో తనపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌ ‌సత్యాగ్రహాన్ని ప్రారంభించింది. గురూజీ నాగపూర్‌కు సమీపంలోనే ఉన్న శివానీ జైలులో ఉన్నారు. అసత్యపు ఆరోపణలతో సంఘాన్ని నిషేధించారు. నిషేధాన్ని తొలగింప చేయడానికి, ఢిల్లీలో ఉన్న సంఘ హితైషి మౌళీ చంద్రశర్మ మధ్యవర్తిత్వానికి మార్గాన్వేషణ చేస్తున్నారు. ఆయన సర్దార్‌ ‌పటేల్‌కు పరిచితులు. నాకా విషయం తెలియదు. నాకప్పటి వరకు సర్దార్‌ ‌పటేల్‌తో కాని, మౌళీచంద్ర శర్మతో కాని పరిచయం లేదు. అలాంటి స్థితిలో ‘కేసరి’ చిరునామాకు మౌళీచంద్ర శర్మ టెలిగ్రాం వచ్చింది. ‘టెలిగ్రాంలో నెగోషి యేషన్సు’ కోసం మీరు ఢిల్లీకి రావడం అవసరం అని ఉన్నది.

సంఘ్‌ ‌సత్యాగ్రహాన్ని ఆపించడానికి పూనా వాస్తవ్యులు ప్రొ।। త్య్రంబక్‌ ‌చికాజీ హార్దికర్‌ ఎం‌తో పట్టుదలతో యోజనా పూర్వకంగా ప్రయత్నిస్తుండే వారు. వారు వెంటబడి, ప్రేరేపించక పోతే ఈ వ్యవహారంలో నేను తల దూర్చేవాడినే కాదు. వూనాలో హార్దికర్‌, ‌ఢిల్లీలో మౌళీచంద్ర శర్మ నా చేత ఈ పని చేయించారు. నేను అంతకు ముందు హార్దికర్‌ ‌ప్రేరేపించగా సర్దార్‌పటేల్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాను. కాని దీనికి పూర్వం, మౌళీచంద్ర శర్మ ఈ విషయంలో నాకెప్పుడూ ఏ సందేశమూ పంపలేదు, ఉత్తరమూ రాయలేదు. అదృష్టవశాత్తు సత్యాగ్రహాన్ని పర్యవేక్షించేందుకు బైట ఉండిపోయిన నాయకులలో బాబారావు భిడే ఒకరు. నాకు వచ్చిన టెలిగ్రాంను తీసుకొని వెళ్లి ఆయనను కలుసుకున్నాను. ఆయన విని ‘నాకు కూడా స్పష్టమైన సమాచారం లేదు. ఢిల్లీలో ఏవో మంతనాలు జరుగుతున్నాయని విన్నాను. మీకందిన టెలిగ్రాం సందేశం ప్రకారం మీరు ఢిల్లీ వెళ్లండి. అక్కడ మీకు వివరాలు తెలుస్తాయి. నేను పుట్టినప్పటి నుండి ఉబ్బసంతో ఉన్నవాణ్ణి. మరొక సమాచారం లేదు, ఢిల్లీలో ఏవో మంతనాలు జరుగుతున్నాయని విన్నాను. మీతోపాటు ఒక స్వయంసేవకుడుంటాడు. ప్రయా ణానికి ఏర్పాట్లన్నీ చేస్తాము’ అని అన్నారు. ఆ విధంగా నేను విమానంలో ఢిల్లీ వెళ్లాను. మౌళీచంద్ర శర్మ, నేను సర్దార్‌ ‌పటేల్‌తో కలిసే ఏర్పాటు చేశారు. సర్దార్‌ ‌పటేల్‌ ఆరోగ్యం కూడా బాగాలేదు. మేము రెండుసార్లు కలుసుకున్నాము. రెండుసార్లూ మంచంలో పడుకునే మాట్లాడారు. సంఘంతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా సానుభూతి ఉన్నవాడు, గురూజీతో పరిచయమున్న వ్యక్తి ఒకడు అవసరమైంది గనుకనే నన్ను ఎంపిక చేసుకున్నట్లు అనిపించింది. అటువంటివాడే ఈ పనికి తగినవాడు. సంఘంమీద మోపిన నిషేధాన్ని నేను తీవ్రంగా విమర్శించాను. ‘కేసరి’ పత్రికలో ‘ముందు ఉరి. తరువాత విచారణ’ లా సంఘాన్ని నిషేధించడం కనబడుతున్నదని తీవ్రధోరణిలో సంపాదకీయాలు రాస్తుండేవాణ్ణి. కొందరు నా మేలు కోరేవాళ్లు ‘ఇలాగే రాస్త్తూపోతే నీవూ జైలుకు వెళ్తావ’ని హెచ్చరిస్తూ ఉండేవారు.

సంఘ్‌ను నిషేధించడం సర్దార్‌ ‌పటేల్‌కు కూడా ఇష్టంలేదు. ఆయన ‘ఢిల్లీ ప్రభుత్వంలో ఈ విషయంలో నేను ఒంటరివాణ్ణి అయినాను. గురూజీ ఏ కారాణాన్ని పురస్కరించుకోనైనా సత్యాగ్రహాన్ని విరమింపచేస్తే, తదుపరి ప్రయత్నాలకు నా సహాయం లభిస్తుంది’ అన్నారు. నేను శివానీ జైలుకు వెళ్లాను. అక్కడే కారాగారంలో గురూజీని ఉంచారు. ఢిల్లీ నుండి గృహమంత్రి ఆదేశాలందిన కారణంగా వారు గురూజీని కలిసేందుకు వెంటనే సమయం దొరికింది. అదీ ఇంత సమయం అని నిబంధన లేకుండా. ఇలాంటి విచిత్ర పరిస్థితిలో కూడా గురూజీ నిశ్చలంగా, శాంతంగా ఉన్నారు. ఏదైనా చేసి నిషేధం తొలిగేట్లు చూడాలని నాలాంటి హితైషులకు ఉన్నది. సంఘ్‌ ‌తత్వ నిష్ఠకు ఏ హానీ జరుగరాదు. సంఘ ప్రతిష్టకు ఏ కించిత్‌ ‌లోపమూ జరుపకూడదు. ఇవి దృష్టిలో ఉంచుకొని మీరు చేయగలిగింది చేయండని గురూజీ నిశ్చయం. సర్దార్‌ ‌పటేల్‌ ‌చెప్పారు గనుక సత్యాగ్రహాన్ని విరమించుకోడానికి ఆయన సిద్ధంగా లేరు.

నేను మళ్లీ ఢిల్లీ వెళ్లాను. ఈసారి సర్దార్‌ ‌పటేల్‌ను చాలా రహస్యంగా కలుసుకునేట్లు ఆయన కార్యదర్శి ఏర్పాటు చేశారు. నన్ను చీకటిలో నిలబెట్టారు. పటేల్‌ ‌పడుకున్నారు. ఆయన తలవైపున ఉన్న కిటికీని మూసివేశారు. దీపాలు ఆర్పారు. కొంతసేపటికి గది జాలీ తెరుచుకున్నది. నన్ను వెనుక తలుపులోంచి లోనికి పంపారు. సంఘం తరపున ఎవరో మధ్యవర్తి సర్దార్‌జీని కలుసుకున్నారనే వార్త పత్రికల వాళ్లకు తెలిసిందని నాకు చెప్పారు. వాళ్లు వెదుకుతున్నారు. అందుకే అందరూ వెళ్లిపోయిన తరువాత మిమ్మల్ని లోపలికి పంపామని చెప్పారు.

సంప్రదింపుల సారాంశం ఏమంటే…గురూజీ సత్యాగ్రహాన్ని ఆపడానికి తమ సమ్మతిని, లేదా ఆశయాన్ని వ్యక్తం చేయాలి. కాని ప్రభుత్వం తరుపునగాని, ఏ ప్రభుత్వాధికారి తరుపునైనా ఏదో హామి లభించినట్లు అందులో ఉల్లేఖించకూడదు.

సర్దార్‌ ‌పటేల్‌తో ఈసారి కలిసిన తరువాత మళ్లీ శివానీకి వెళ్లాను. గురూజీని కలిసాను. ఈ కలయిక నాలుగు గంటలపైగా కొనసాగింది. అసలు ఇచ్చింది రెండుగంటలే. మధ్యలో ఆపి నేను జైలు అధికారిని ‘టైం ఐ పోయిందా?’ అని అడిగాను. ‘మీకు అవసర మైనంత సమయాన్ని తీసుకోండి. మేము కాదనము’ అని ఆ అధికారి అన్నాడు. సత్యాగ్రహాన్ని ఆపడానికి జారీ చేయవలసిన ఆజ్ఞాపత్రంలోని ప్రతి శబ్దాన్ని గురూజీ మాటిమాటికి దిద్దుతూ పోయినారు.

ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు చిత్తుప్రతులు తయారైనాయి. శబ్దప్రయోగం సరిగా లేదని కొన్నింటిని నిరాకరించారు. అయిదవ చిత్తుప్రతి తృప్తికరంగా తయారైంది సంఘాన్ని గురించి అల్పభావన ఏ మాత్రం ఏర్పడకుండా గురూజీ ఒక్కొక్క శబ్దాన్ని తూచి తూచి వాడారు. అంగీకారం తెలియచేస్తూ రెండు ప్రతులు తయారైనాయి. ఒకటి గురూజీ దగ్గర ఉంచి, రెండో ప్రతిని తీసుకొని అయిదు గంటల తరువాత కారాగారం నుండి బైటికి వచ్చాను. పత్రికా ప్రతినిధులు నా చుట్టూ చేరారు ‘సర్దార్‌ ‌పటేల్‌ ఏమైనా మీకు మాట ఇచ్చారా’ అనే ప్రశ్నను అందరూ అడిగారు. ‘ఎవరూ ఎవరికీ మాట ఇవ్వలేదు. కాని ఏదైనా ఆశించవచ్చు కదా’ అని నా సమాధానం.

శివానీ జైలు అధికారుల సౌజన్యాన్ని నేను మరువ లేను. గురూజీ విషయంలో ఏమి చెప్పను? వారి ఆరోగ్యాన్ని గురించి అడిగితే, ‘అద్భుతంగా ఉన్నదని’ అంటూ నా ఆరోగ్యాన్ని గురించి దిగులు పడ్డారు. కారాగృహంలో వసతులు లేవని ఏడ్చేవాళ్ల ఏడుపులుంటాయి. కానీ గురూజీకి కారాగృహంలో ఉన్నట్లేలేదు. ఆయన ఆనందమయ స్వభావ ప్రభావంతో నేను కూడా కారాగృహంలో ఉన్నానన్న మాటే మరిచాను.

ఆ ప్రకటనలో ఆయన రాసిన మాటలను గురించి నిర్బంధం తొలిగించే దాకా మాట్లాడడ•ం మంచిది కాదు. ఈ ఆలస్యకారణంగా నేడైనా నలుగురి ముందుంచడం నా విధి.

సత్యాగ్రహం ముగిసిన కొన్ని నెలల తర్వాత నిషేధం తొలిగింది. అంతవరకు గురూజీ, నేను, సర్దార్‌పటేల్‌• అయోమయ స్థితిలో గడిపాం. నిష్కారణంగా సత్యాగ్రహాన్ని ఆపారని గురూజీ అన్నారు. నిషేధం తొలగలేదు. అందుకు నాపైనా, సర్దార్‌ ‌పైనా ఆరోపణ. సుఖాంతం ఎప్పుడూ సుఖాంతమే. అంతా పవిత్రమే అవుతుంది. సంఘం మీద విధించిన నిషేధాన్ని తొలగించడానికి నేను ప్రయత్నించాననడం భగవద్గీత ప్రకారం అహంకారమవుతుంది. కర్మ కారణంగానైనా దైవం చాత్రి పంచకమ్‌ అం‌టారు. ఈ అయిదవ కారణం సాంఖ్యశాస్త్రంలో భగవద్గీత చెప్పినటువంటిది. ఈ విషయంలో అదే ప్రధాన భూమిక వహించింది. నన్ను ప్రవాహంలోకి తోశారు. అంతే.

సంఘం మీద నిషేధం తొలగిన తర్వాత, దానికై ప్రయత్నించిన వెంకటరామశాస్త్రి, మౌళీచంద్ర శర్మలతోపాటు గురూజీ నా పేరు కూడా తమ ప్రకటనలో పేర్కొని నాకు ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరం రాశారు.

– శ్రీ గ.వి.కేతకర్‌, ‌కేసరి సంపాదకులు, పుణే (వివేక-వారపత్రిక-జూన్‌ 17, 1973)
– శ్రీ ‌గురూజీ సమగ్ర గ్రంథావళి (సంస్మరణ) -12వ భాగం నుంచి