News

రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, భారత్ విడిచి వెళ్లిపోండి : వాట్సాప్, మెటాకు సుప్రీంకోర్టు వార్నింగ్

75views

భారత రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీలు వాట్సాప్, మెటాలకు సుప్రీంకోర్టు హితవు పలికింది. భారత ప్రజల గోప్యతా (ప్రైవసీ) హక్కును కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రాజీపడేది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దేశంలోని కోట్లాది పేద, నిరక్షరాస్య ప్రజలకు మీ ప్రైవసీ పాలసీలు అర్థమవుతాయా అని వాట్సాప్, మెటాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. పేద మహిళ, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే నిరుపేద వ్యక్తి, ఎవరైనా తమిళం మాత్రమే మాట్లాడే వ్యక్తి లాంటి వాళ్లకు మీ ప్రైవసీ పాలసీలు అర్థమవుతాయా అని సోషల్ మీడియా కంపెనీలను సుప్రీంకోర్టు బెంచ్ నిలదీసింది. కొన్నిసార్లయితే తమలాంటి వ్యక్తులే ఆ పాలసీలను అర్థం చేసుకోలేక సతమతం అవుతుంటారని ధర్మాసనం పేర్కొంది. 2024 నవంబరు 18న వాట్సాప్ నిర్వాహక కంపెనీ మెటాపై రూ.213.14 కోట్ల జరిమానాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించింది. వాట్సాప్ యూజర్ల సమాచారాన్ని అడ్వర్టయిజ్‌మెంట్ కంపెనీలకు షేర్ చేసే ప్రక్రియపైనా ఐదేళ్ల నిషేధాన్ని విధించింది. ‘‘వాడితే వాడండి, లేదంటే వదిలేయండి’’ అన్నట్టుగా వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఉందని సీసీఐ వ్యాఖ్యానించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వాట్సాప్, మెటా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశాయి. మంగళవారం వీటిపై విచారణ నిర్వహించే క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.

ఆప్ట్ ఔట్ గురించి మాలాంటి వాళ్లకే తెలియదు
భారత ప్రభుత్వ సంస్థ సీసీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, వాట్సాప్, మెటా కంపెనీల తరఫు న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అఖిల్ సిబల్‌ వాదనలు వినిపించారు. నిలిపివేయండి (ఆప్ట్ ఔట్) అనే ప్రస్తావన తమ ప్రైవసీ పాలసీలో ఉందని, అలాంటప్పుడు యూజర్ల సమాచారాన్ని తాము వాణిజ్య ప్రకటనల సంస్థలకు బదిలీ చేయడంపై అభ్యంతరం ఎందుకని వాట్సాప్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఆప్ట్ ఔట్ లాంటి ఆప్షన్ల గురించి తమలాంటి వాళ్లకే సరిగ్గా తెలియదని, ఎక్కడో బిహార్‌లోని మారుమూల పల్లెల్లో ఉండే భారతీయులకు ఎలా తెలుస్తుందని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. ప్రైవసీ పాలసీ మాటున భారతీయ వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారని మండిపడింది. ఇలా జరగకుండా అడ్డుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది.

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యక్తిగత అనుభవం
ఈక్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తన వ్యక్తిగత అనుభవం ఒకటి చెప్పారు. ‘‘కొంతమంది వాట్సాప్ యూజర్లు, డాక్టర్లతో వాట్సాప్‌లో ప్రైవేట్ ఛాటింగ్ చేశారట. ఆ వెంటనే వాళ్లకు మెడిసిన్స్‌కు సంబంధించిన యాడ్స్ కనిపించడం మొదలైందట. ఈ లెక్కన యూజర్ల సమాచారాన్ని, ఆసక్తులను కూడా డబ్బుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు’’ అని సీజేఐ పేర్కొన్నారు. వాట్సాప్ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ, అన్ని వాట్సాప్ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయన్నారు. స్వయంగా వాట్సాప్ కంపెనీ కూడా వాటిని చూడలేదని స్పష్టం చేశారు.

యూజర్ల మెటా డేటా భద్రతకు మార్గదర్శకాలివ్వండి
సీసీఐ తరఫు న్యాయవాది తుషార్ మెహతా జోక్యం చేసుకుంటూ, యూజర్ల సమాచారాన్ని అడ్వర్టయిజ్‌మెంట్ కంపెనీలకు షేర్ చేసే విషయంలో వాట్సాప్, మెటాలు దోపిడీదారు వైఖరితో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. యూజర్ల నుంచి నిర్దిష్ట అనుమతిని పొందకుండానే వారి వ్యక్తిగత యాక్టివిటీలు, ఆసక్తుల సమాచారాన్ని సోషల్ మీడియా కంపెనీలు అమ్ముకోకుండా నిరోధించాలని తుషార్ మెహతా కోరారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం సోషల్ మీడియా యూజర్ల మెటా డేటా భద్రత కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు.

మెటా డేటా భద్రతపై సూచనలివ్వండి.. కేంద్రానికి ఆదేశం
తుషార్ మెహతా వాదనతో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏకీభవిస్తూ రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, దేశం విడిచి వెళ్లిపోవాలని వాట్సాప్, మెటాలను హెచ్చరించారు. ఈ లిటిగేషన్‌లో భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కూడా ఒక పక్షంగా చేరుస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా యూజర్ల మెటా డేటా భద్రతపై తగిన సూచనలను తమకు సమర్పించాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను సీజేఐ ఆదేశించారు.

ఫిబ్రవరి 9న మధ్యంతర ఆదేశాలు
ఈ అంశంపై వాదనలు ముగిసే వరకు యూజర్లకు సంబంధించిన ఏ సమాచారాన్నీ మెటా కంపెనీకి ఇవ్వొద్దని వాట్సాప్‌కు సుప్రీంకోర్టు బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. సోషల్ మీడియా కంపెనీల వాణిజ్య వ్యవహారాల వల్ల భారత పౌరుల ప్రాథమిక గోప్యతా హక్కుకు భంగం కలగరాదని తేల్చి చెప్పింది. డేటా షేరింగ్ పేరుతో భారత పౌరుల ప్రైవసీ హక్కుతో ఆటలు ఆడటం సరికాదని పేర్కొంది. అన్యాయంగా వాట్సాప్ యూజర్ల సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసేందుకు టెక్ కంపెనీలకు అనుమతి ఇచ్చేది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. టెక్ దిగ్గజ కంపెనీల ప్రైవసీ షరతులు, నిబంధనలకు చాలా తెలివిగా రూపకల్పన చేశారని మండిపడింది. ఈ అంశంపై మళ్లీ ఫిబ్రవరి 9న వాదనలు వింటామని, ఆ రోజునే మధ్యంతర ఆదేశాలను జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.