
ఈ నెల 7,8 తేదీల్లో ముంబైలోని వర్లి కేంద్రంగా “100 ఏళ్ళ సంఘ్ యాత్ర – కొత్త ఆశయాలు” అనే కార్యక్రమం జరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. సంఘ్ కార్య శతాబ్ది సందర్భంలో ఈ కార్యక్రమం జరగనుందని, దీనికి 1200 మందికి పైగా అతిథులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
సునీల్ అంబేకర్ ముంబైలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చే 1200 మంది అతిథుల్లో ఆర్థిక నిపుణులు, న్యాయ నిపుణులు, పరిపాలనా అనుభవం గలవారు, కళలు, క్రీడలు, ధర్మానికి సంబంధించిన వారు, రాజకీయ వ్యక్తులు, కార్పొరేట్ రంగం, సినిమాతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు.
ఫిబ్రవరి 7వ మరియు 8వ తేదీలలో వర్లిలోని నెహ్రూ సెంటర్ ఆడిటోరియంలో మొత్తం నాలుగు సెషన్‌లు జరుగుతాయని తెలిపారు. మొదటి రోజున మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 7:30 వరకు రెండు సెషన్‌లు, రెండవ రోజున ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు మరో రెండు సెషన్‌లు జరుగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ పాల్గొంటారని, ఇందులో భాగంగా మొదటి రోజు ప్రసంగిస్తారని, రెండో రోజు ప్రశ్న- జవాబుల కార్యక్రమంలో ప్రముఖులు అడిగిన ప్రశ్నలకు భాగవత్ సమాధానాలిస్తారని తెలిపారు. అయితే.. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ సంఘ కార్య శతాబ్ది నేపథ్యంలో ప్రతిపాదించిన ‘‘పంచ పరివర్తన్’’ కేంద్రంగానే ప్రసంగం చేస్తారన్నారు.
సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా లాంటి నగరాల్లో ఇప్పటికే ఇలాంటి ఉపన్యాస శ్రేణి కార్యక్రమాలు జరిగాయని అంబేకర్ గుర్తుచేశారు. ముంబై కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమం చివరి కార్యక్రమని పేర్కొన్నారు.





