
కడప నగరంలో శ్రీరామ మూడో మహాశోభాయాత్ర కనుల పండువగా జరిగింది. అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో చిన్నచౌకులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి యాత్ర ప్రారంభమైంది. తొలుత ప్రత్యేక రథంపై శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువు దీర్చారు. విజయభట్టర్ ఆధ్వర్యంలో అర్చక బృందం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో బాల శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని యేటా నిర్వహిస్తున్నారు. ఉదయం 7.45 గంటలకు శోభాయాత్ర ప్రారంభించారు. అప్పటికే వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, దిక్కులు పిక్కటిల్లేలా జై శ్రీరామ్ నినాదాల మధ్య శోభాయాత్ర అత్యంత వైభవంగా ముందుకు సాగింది.
వైభవోపేతం
కోలాటాలు, కేరళ వాయిద్యాలు, భజరంగి హనుమాన్ విన్యాసాలు, ఒంగోలు లక్ష్మారెడ్డి బృందం నిర్వహించిన ప్రదర్శనలు, మైదుకూరు కళాకారుల వేషధారణలు, శ్రీకాకుళం జిల్లా తప్పెట గుండ్లు, ప్రొద్దుటూరు గాయత్రి బృందం కోలాటం, కంత్రీనాయుడు పిల్లన గ్రోవి, నరసరావుపేట రెబల్ డప్పులు, కర్నూలు, పుత్తూరు, కడప మహిళా బృందాల కోలాటం, డ్రమ్స్, డీజే, చెక్కభజన, రకరకాల బాణాసంచా పేలుళ్లు, రాజు బుట్టబొమ్మలు వంటి పలు ప్రదర్శనల కోలాహలం హోరెత్తాయి. డ్రోన్ హనుమంతుడు ప్రజలను విశేషంగా ఆకర్శించాడు. వళ్లు గగుర్పొడిచే విధంగా నిర్వహించిన కత్తిసాము, కర్రసాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీరామచంద్రుడు, సీతమ్మవారు, ఆంజనేయస్వామి, నరసింహస్వామి తదితర దేవతల వేషధారణలు ఆకట్టుకున్నాయి. పలువురు కళాకారులు శ్రీరామచంద్రుడిపై భక్తిగీతాలను ఆలపించారు. రథంపై కొలువుదీర్చిన శ్రీరాముడి భారీ విగ్రహం అందరిలో భక్తిభావాన్ని నింపింది. అర్చకులు ప్రజలకు అడుగడుగనా కల్యాణ హారతులు ఇస్తుండగా, భక్తులు తన్మయత్వంతో కార్యక్రమాలను తిలకించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు ఈ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శోభాయాత్ర ఆద్యంతం జన సంద్రాన్ని తలపించింది.
భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు
శోభాయాత్ర నేపధ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి ప్రధాన కూడలిలోనూ అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సౌకర్యం, కాఫీ, టీతోపాటు శీతల పానీయాలు, పుష్కలంగా మంచినీరు అందుబాటులో ఉంచారు. జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ఐదు వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ శ్రీరాముడి కల్యాణం తర్వాత ఇంత భారీ స్థాయిలో శోభాయాత్ర నిర్వహించడం ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరగ లేదన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. నిర్వాహకులతో పాటు ప్రజలు ఎక్కడికక్కడ తమకు తోచిన రీతిలో శోభాయాత్ర విజయవంతానికి కృషిచేయడం నిజంగా మెచ్చుకోదగ్గదని తెలిపారు. అయోధ్య ఐక్యవేదిక స్థానిక ప్రతినిధి, కార్యక్రమ నిర్వాహకులు దేసు వెంకటరెడ్డి యాత్ర ముగిసేవరకు తన బృందంతో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పోలీసులు, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది సహకారంతో యాత్ర సజావుగా కొనసాగింది.
ఉదయం చిన్నచౌకులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర అప్సర సర్కిల్, వై జంక్షన్, ఆర్టీసీ బస్టాండు, ఎస్పీ బంగ్లా, రాజారెడ్డివీధి, నెహ్రూపార్కు, అన్నమయ్య సర్కిల్, కృష్ణా సర్కిల్, గోకుల్ సర్కిల్, మహిళా పోలీసుస్టేషన్, వైఎస్సార్ సర్కిల్, పాత బస్టాండు, ఏడురోడ్ల కూడలి, పాత రిమ్స్, ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డిసర్కిల్, కాగితాలపెంట, ఐటీఐ సర్కిల్, సంధ్య సర్కిల్, ఎర్రముక్కపల్లె సర్కిల్, రాజీవ్ పార్కు రోడ్డు, యోగి వేమన సర్కిల్, పూల అంగళ్ల మీదుగా పొద్దుపోయాక హౌసింగ్‌బోర్డు శ్రీ కోదండ రామాలయానికి చేరుకోవడంతో యాత్ర పరిసమాప్తమైంది.





