
కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా కొనసాగిన మండల- మకరవిలక్కు తీర్థయాత్ర సీజన్ మంగళవారం ఉదయం ముగిసింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను అధికారికంగా మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధికారులు ప్రకటించారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ అయ్యప్ప దర్శనం పూర్తిచేసుకున్న అనంతరం ఆలయాన్ని మూసివేయడం సంప్రదాయంగా జరుగుతోంది. సంప్రదాయ ప్రకారం ఆలయ తాళపు చెవులను పందలం రాజకుటుంబ ప్రతినిధికి అప్పగించారు. నెలవారీ పూజల ఖర్చుల కోసం ఉంచే డబ్బుల సంచిని కూడా అప్పగించినట్లు టీడీబీ అధికారులు వెల్లడించారు.
మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే?
ఫిబ్రవరి 2026లో జరిగే నెలవారీ పూజల కోసం ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు. టీడీబీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, కుంభం మాసపు నెలవారీ పూజలు ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 17 రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. ఈ సమయంలో కూడా భక్తులు స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. దర్శన టోకెన్లు, ఆన్‌లైన్ బుకింగ్, భద్రతా ఏర్పాట్లు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని చెప్పారు.





