
బిహార్‌లోని గయా, ఔరంగాబాద్ సరిహద్దులో గల పీరు, బంతారా గ్రామాలు భారతీయ సంస్కృతిలోని వైవిధ్యానికి సజీవ సాక్ష్యాలు. ఈ గ్రామాల ముస్లింలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ, వారి ఇళ్లలో శుభకార్యాలు హిందూ పద్ధతుల్లోనే జరుగుతాయి. మసీదులో నికాహ్ జరిపాక, ఇంటి వద్ద హిందూ ఆచారాలే పాటిస్తారు. వధువు నుదుట సిందూరం అలంకరిస్తారు. పెళ్లిపందిరిలో నాగలితో భూమిని దున్నుతారు. ఈ రెండు గ్రామాల్లో సుమారు వెయ్యి ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. వీరి ఇళ్లలో వివాహ వేడుకలు మొదలైతే శ్రీరాముడి కీర్తనలు వినిపిస్తాయి. హల్దీ వేడుకలో మహిళలు జానపద గీతాలను ఆలపిస్తారు. ఈ ఆచారాల వెనుక 600 ఏళ్ల చరిత్ర ఉందని గ్రామస్థులు చెబుతారు. 14వ శతాబ్దంలోని ఫిరోజ్ షా తుగ్లక్ పాలనలో స్థానిక జమీందార్ల కుటుంబాలు ఇస్లాం మతాన్ని స్వీకరించాయి. మతం మారినా, తమ పూర్వీకుల నుంచి వస్తున్న హిందూ సంప్రదాయాలను కొనసాగించిన వీరు తాము హిందూ భూమిహార్ల వంశస్థులమని చెబుతారు.





