ArticlesNews

ఘనంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం

153views

సంక్రాంతి పండుగ అనగానే కోనసీమలో జగ్గన్నతోట ప్రభల తీర్థం గుర్తొస్తుంది. ఇతర ప్రాంతాల్లో దైవికపరమైన వేడుకను ఉత్సవంగా పరిగణిస్తే, కోనసీమ ప్రాంతంలో మాత్రం తీర్థంగా పిలుస్తారు. ఈ ఉత్సవ ప్రాంతంలో ఆలయం ఏమీ ఉండదు. కనుమ రోజున అంబాజీపేట మండలం మొసలిపల్లిలో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న అద్భుత వేడుక ఇది. స్థానికులేగాక ప్రవాసాంధ్రులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని, ఏకాదశ రుద్రుల అనుగ్రహానికి పాత్రులవుతారు.

వెదురు కర్రలు, రంగురంగుల కుసుమాలు, వస్త్రాలతో అలంకరించిన ఉత్సవ విగ్రహాలతో కూడి…న వాటిని ప్రభలుగా వర్ణిస్తారు. ఈ జగ్గన్నతోట తీర్థానికి పదకొండు గ్రామాల నుంచి వేంచేసే ప్రభలకు ఏకాదశ రుద్ర ప్రభలని పేరు. ఈ క్రమంలో వ్యాఘ్రేశ్వరం- వ్యాఘ్రేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం- వీరేశ్వర స్వామి, ఇరుసుమండ- ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక- కాశీ విశ్వేశ్వర స్వామి, ముక్కామల- రాఘవేశ్వర స్వామి, నేదునూరు- చెన్నమల్లేశ్వర స్వామి, మొసలపల్లి- మధుమానంత భోగేశ్వర స్వామి, పుల్లేటికుర్రు- అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, పాలగుమ్మి- చెన్నమల్లేశ్వర స్వామి, కె.పెదపూడి- మేనకేశ్వర స్వామి, గంగలకుర్రు- చెన్నమల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రభలపై మంగళ వాయిద్యాలతో జగ్గన్నతోటకు ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ వేడుక జరిగేది మొసలపల్లి గ్రామ శివారులో కాబట్టి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి అన్ని ప్రభల కన్నా ముందుగా జగ్గన్నతోటకు చేరుకొని, మిగిలిన వారికి ఆహ్వానం పలుకుతూ ఆతిథ్యం ఇస్తూ, అవి తిరిగి వెళ్లేవరకూ తీర్థంలోనే ఉండటం సాంప్రదాయం. ఈ ఉత్సవానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరం తాలూకా వ్యాఘ్రేశ్వర స్వామి వారి ప్రభ తీర్థంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు.. అంతకుముందే చేరుకుని ఉన్న తక్కిన రుద్ర ప్రభలను పైకి లేపడం ఆనవాయితీ.

జగ్గన్నతోట ప్రభల తీర్థంలో వీరేశ్వర స్వామి, చెన్నమల్లేశ్వర స్వామి వార్ల ప్రభలను సుమారు వందమంది యువకులు ‘శరభ శరభ’ అంటూ పంట పొలాలను తొక్కుకొని నిండు ప్రవాహంతో సాగుతున్న అప్పర కౌశికను దాటుతూ ఉంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. ప్రభలు వరిచేలను తొక్కుకుంటూ వస్తున్నప్పుడు రైతులు బాధపడకపోగా తమకు పాడిపంటలు సమృద్ధిగా కలుగుతాయని భావిస్తారు.

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు దేశవ్యాప్తంగా నిర్వహించే విభిన్న సాంప్రదాయ పండుగల జాబితాలో- జగ్గన్నతోట రుద్రప్రభలకు చోటు కల్పించారు. పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఈ తీర్థ ప్రాధాన్యతను వివరిస్తూ పాఠాన్ని పొందుపరిచారు.