News

భగత్ సింగ్ విచారణ రికార్డుల యాక్సెస్ కోసం యూకేకు లేఖ రాసిన పంజాబ్ ప్రభుత్వం

242views

భగత్ సింగ్ విచారణకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం యూకేకు కీలక లేఖ రాసింది. భగత్ సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్ థాపర్, శివరామ్ హరి రాజ్‌గురుల విచారణకు సంబంధించిన అసలైన ఆడియో, వీడియో రికార్డింగ్‌లు, ఆర్కైవల్ డాక్యుమెంటేషన్‌ను అందించాలని పంజాబ్ ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం స్కాటిష్ మ్యూజియంలో భద్రపరిచిన ఈ సామగ్రిని పంజాబ్‌కు అప్పగించాలని అభ్యర్థించింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ హెచ్ ఇ ఆల్బా స్మెరిగ్లియోకు లేఖ రాశారు. ఈ చారిత్రక ఆధారాలను ఖట్‌కర్ కలాన్‌లోని భగత్ సింగ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌లో అధ్యయనం, డిజిటల్ పరిరక్షణ, బహిరంగ ప్రదర్శన కోసం ఉపయోగించాలని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్ తరాలు భగత్ సింగ్ వారసత్వంతో మమేకం కావడానికి వీలు కలుగుతుందని తెలిపారు. దీనికి పంజాబ్ పర్యాటక శాఖ కార్యదర్శి డా అభినవ్ త్రిఖాను నోడల్ ఆఫీసర్‌గా నియమించనున్నట్టు చెప్పారు. దీని ద్వారా ఉమ్మడి చరిత్ర, న్యాయం, త్యాగం, మానవ గౌరవం వంటి సార్వత్రిక ఆదర్శాలను గౌరవించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందన్నారు. ఈ రికార్డులు పంజాబ్ ప్రజల్లో లోతైన చారిత్రక, భావోద్వేగ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని లేఖలో వివరించారు. లాహోర్ కుట్ర కేసుగా పిలువబడే కేసులో బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ హత్య చేసినందుకు 23 ఏళ్ల భగత్ సింగ్‌ను సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో పాటు మార్చి 23, 1931న ఉరితీశారు.