
ఏదీ నాటి వైభోగం…!
ధాన్యపు సిరులు కురిపించి కర్షకుల కళ్లలో ఆనందకాంతులు నింపే సంక్రాంతి పరిస్థితి వర్తమానంలో అలా ఉందా? అంటే సానుకూల సమాధానం రావడం కష్టమే. నాసిరకం వ్యవసాయ ఉత్పాదకాలు. అతివృప్టి- అనావృష్టితో సతమతం. గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, దళారుల బెడద. వెరసి…అప్పుల బాధలు అన్నదాతలు వెన్ను విరుస్తున్నాయి. తాను అరకొరగా తింటూ పదిమందికి కడుపునిండా పెట్టే ‘వర్తమాన రైతు భారతం’గురించి మాధ్యమాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి.
ఒకనాడు ఈ పండుగ అన్ని వృత్తులవారికి ఉపాధి కల్పించేదే. గంగిరెద్దుల వారు, హరిదాసులు, జంగాల తదితర సామాజికవర్గాల, వృత్తుల వారు వృత్తి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ సమాజం నుంచి కానుకలు స్వీకరించేవారు. స•ంక్రాంతి వేళల్లో తప్పనిసరిగా కనిపించే వాటిలో గంగిరెద్దుల ఆట ముఖ్యమైంది. ‘గంగి’ని పవిత్రమైన ‘గంగ’కు ప్రతీకగా భావిస్తారు. ఇది ఒకనాటి మాట. నేడు హరికథ, గంగిరెద్దులు తదితర జానపద కళలు పల్లెల్లోనూ నామ మాత్రమవుతున్నాయి. నెలరోజుల పాటు హరిదాసులు వీధివీధులు తిరుగుతూ శ్రావ్యంగా హరినామ సంకీర్తన చేయడం మధురానుభూతి. కాల క్రమంలో…. కులవృత్తి కడుపునింపక పోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధిని వెదుక్కుంటుండగా, పాత•తరం కళాకారులు కులవృత్తిని వదులుకోలేక…కొనసాగలేక కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకొన్నాళ్లకు ఈ కళారూపాలు కనుమరుగై పోతాయేమోనని కళాభిమానులు కలత చెందుతున్నారు.
ఇక సంక్రాంతి సమయంలో కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది లేదు. సంక్రాంతి అంటే కోడిపందాలు అనేలా పరిస్థితి మారింది. ఒకనాడు వినోదంగా ప్రారంభమైన ఈ పక్రియ రానురాను జూదంగా ‘వ్యాపార సంస్కృతి’గా పరిణ మించింది.భారీ నుంచి అతిభారీ మొత్తంలో ‘ఫణం’గా పెడుతూ ఆర్థికంగా కుదేలవుతున్న వారెందరో!.
పల్లెబాట
పల్లెలో పుట్టినవారికి దాని పేగుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సంక్రాంతి పండుగ వేళ పట్టణ ప్రజ పల్లెబాట పడుతోంది. కానీ, నాటి అనుభూతి కానరావడంలేదని అంటున్నారు. అందుకు ఎన్నో కారణాలు. తరానికి, తరానికి అంతరం ఏర్పడుతోంది. నాటి ఆప్యాయత అనురాగాలు నేటి యాంత్రిక జీవితం, క్షుద్ర,స్వార్థ రాజకీయాలతో కలుషితమవుతున్నాయనడంలో సందేహం లేదు.కులమతవర్ణ వర్గాలకు అతీతంగా వావివరుసలతో పిలుపులు, మమతానురాగాలు, ఆప్యాయతలను పంచుకోవడం కరవై పోతోంది. ఉళ్లల్లో ఉన్న ఆ కొద్దిరోజుల్లోనైనా మనసార ముచ్చట్లాడుకొనే అవకాశం లేదు. అందుకు ప్రధాన కారణం చేతుల్లోని ‘సంచారవాణి’ (మొబైల్ ఫోన్) ప్రధాన కారణమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పెరుగుతున్న సాంకేతిక, సౌకర్యాలు మానవ సంబంధాలను మసకబారుస్తున్నాయనేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.అందరు ఒకేచోట కూడినా, ఎవరికి వారు ఒంటరే. ఏ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో పల్లెసీమల్లో రోజులను క్షణాల్లా గడిపి, బరువెక్కిన గుండెలతో వీడ్కోలు తీసుకొన్న దశ నుంచి మొక్కుబడి సందర్శనకు, పండుగ వస్తే తప్ప పల్లె ముఖం చూడలేని స్థితికి వచ్చేశాం. అయితే… నేటి మన కర్తవ్యం ఏమిటి? స్వగ్రామాలకు వెళ్లగలిగి, వెళ్లలేకపోతున్నవారు తమ జీవితాలలో ఆనందాన్ని ఏ మేర కోల్పోతున్నారో ఆత్మపరిశీలన చేసుకుంటే… జన్మభూమి విలువ బోధపడుతుంది.
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’





