ArticlesNews

హరిదాసులు సంస్కృతి సారథులు

120views

గలగల గజ్జెల చప్పుడు, అలరించే హరినామ సంకీర్తనలతో గ్రామాలకు సంక్రాంతి శోభ తెచ్చింది.. శిరస్సుపై అక్షయపాత్ర ధరించి ఒక చేత్తో వీణ, మరో చేత్తో చిడతలు వాయిస్తూ హరినామ సంకీర్తనలను ఆలపిస్తూ సంచరించే హరిదాసులు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు. వారి గానం వినిపిస్తే చాలు ప్రతి ఇంటి ముందు అతివలు బియ్యం, పండ్లు, పూలతో వేచి ఉంటారు. హరిదాసు వస్తే శిరస్సుపై ధరించిన అక్షయపాత్రలో ఆ బియ్యం వేసి సాక్షాత్తు ఆ నారాయణుడే తమ ఇంటికి వచ్చినట్లు భావించి చేతులు జోడించి నమస్కరిస్తారు. ఇదంతా ధనుర్మాసం ప్రారంభం నుంచి ప్రతి గ్రామంలో 33 రోజుల పాటు కొనసాగుతుంది.

సంస్కృతీ సంప్రదాయాలను ఇనుమడింపజేసే వారి వెనుక పడే కష్టం పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కేవలం 33 రోజులు ఇలా హరిదాసులుగా తిరిగే వీరు మిగిలిన 11 నెలల పాటు సామాన్యుల్లా కాయకష్టం చేసి కడుపు నింపుకొంటారు. మోయలేని భారమైనా తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయాలను కొనసాగించాలనే పట్టుదలే వీరిని హరిదాసులుగా కొనసాగిస్తుందనడంలో సందేహం లేదు. దీక్షా.. పట్టుదలే వీరికి ఆయుధాలు. అలుపెరుగని కాలినడకే వీరి దైనందిన జీవితం. కాకినాడ జిల్లాలో సుమారు 250 మంది విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చిన హరిదాసులు గ్రామాల్లో తిరుగుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అక్కడి వారే హరిదాసులుగా కొనసాగుతున్నారు. వీరు సాగే పయనంలో ఆకలి దప్పికలు వారికి అసలు గుర్తుకురావు. ఎవరేమనుకున్నా వారి హరినామ సంకీర్తన ఆగదు.

అక్షయ పాత్రదే ప్రథమ స్థానం
కలశం లేదా అక్షయపాత్రగా పిలిచే ఆ పాత్రకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ పాత్రలో భిక్ష వేయడం ద్వారా నారాయణుడికి నైవేద్యం సమర్పించినట్లు భక్తులు భావిస్తారు. అదీ ధనుర్మాసంలో హరికి కొత్తగా పండిన ధాన్యాలు సమర్పించడం ద్వారా పాడి పంటలు అభివృద్ధి చెందాలని భక్తులు కోరుకుంటారు. ఈ అక్షయపాత్ర హరిదాసు శిరస్సుపై ఉన్నంత సేపు కాలకృత్యాలు తీర్చుకోవడం గాని, అన్న పానీయాలు తీసుకోవడం గాని, కనీసం వేరొకరితో మాట్లాడడం గాని చేయడం నిషేధం. అకుంఠిత దీక్షతో సాక్షాత్త్తూ ఆ నారాయణుడే గ్రామాల్లో తిరుగుతున్నాడనిపించేలా పవిత్రంగా తిరగాల్సి ఉంటుంది. అలాగే ఆ పాత్ర శిరస్సుపై ఉన్నంత సేపు పాదరక్షలు కూడా వేసుకోకుండా ఎక్కడా ఆగకుండా (భిక్ష వేసేటప్పుడు తప్ప) గ్రామ సంచారం కొనసాగించాలి. ఎక్కడైనా అక్షయపాత్ర నిండితే ఆ ప్రాంతంలోని ఒకచోట దానిలో భిక్షను భద్రపరిచి తిరిగి సంకీర్తనను ప్రారంభిస్తారు. పాత్ర ధరించే ముందు తలస్నానం చేసి హరిదాసు వేషధారణలో భాగంగా పంచె, కండువా ధరించి పూలతో అలంకరించిన అక్షయపాత్రను శిరస్సున పెట్టుకుని బయలు దేరుతారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి గ్రామ సంచారం పూర్తయ్యాక అల్పాహారం తీసుకుని సాయంత్రం భోజనం చేసి పాలు తీసుకుంటారు. హరిదాసులు మాంసాహారానికి దూరంగా ఉంటారు.