News

పెనుకొండలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్

153views

అనంతపురం జిల్లా పెనుకొండకు ప్రతిష్టాత్మకమైన ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ రానుంది. రూ.425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటుతో 4,035 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు.

పెనుకొండలోని ప్రఖ్యాతగాంచిన గణగిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం ఉన్న కొండపై ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహం బోర్డు(ఎస్ఐపీబీ) పచ్చజెండా ఊపిందన్నారు. 60 ఎకరాల్లో ఆథ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటుకు ఆమోదం లభించిందని మంత్రి సవిత తెలిపారు.

ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంపు ఏర్పాటుతో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా పెనుకొండ అభివృద్ది చెందుతుందన్నారు. దేశ, విదేశాలకు చెందిన భక్తులు పెనుకొండకు రానున్నారన్నారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటుతో 1,035 మందికి ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుందన్నారు. త్వరలోనే ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నట్ల మంత్రి సవిత తెలిపారు.