News

వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

138views

వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది.

రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి.తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది.అన్ని కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు నిండిపోయారు. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక..తెనాలి వైకుంఠపురం, మంగళగిరి లక్ష్మీ నరసింహ ఆలయం, పానకాల కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. విష్ణు సహస్రనామ పారాయణ, వేద పారాయణ నిర్వహించారు. దేవుని కడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై నుంచి భక్తులను శ్రీహరి కటాక్షిస్తున్నారు.

ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.